Latest Telugu News: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీ టార్గెట్ చేయాలని చూసింది. అయితే అంతలోనే టీటీడీ సాక్ష్యాధారాలతో సహా బదులిచ్చింది. ఇంతకీ ఆనం ఎందుకు వార్తల్లోకెక్కారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి టీటీడీ ఇచ్చిన బదులేంటి..?


దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల తిరుమల వెళ్లారు. దర్శనం అనంతరం బయటకు నడచి వస్తుండగా కొంతమంది భక్తులు ఆయన వద్దకు వచ్చారు. తిరుమలలో సామాన్య భక్తులు నరకం చూస్తున్నారంటూ అతను మంత్రికి ఫిర్యాదు చేశాడు. గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్నా ఆహారం అందలేదని, శ్రీవారి దర్శనం చేసుకోలేకపోతున్నామని మరికొందరు చెప్పారు. మూడు రోజులుగా తమకు శ్రీవారి దర్శనం కాలేదని, వీఐపీలు మాత్రమే భక్తులా అంటూ సదరు వ్యక్తి మంత్రి ఆనంను నిలదీసినట్టు వైసీపీ అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఆనంను నిలదీసిన భక్తుడు అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై వెంటనే టీటీడీ స్పందించింది. మంత్రికి ఫిర్యాదు చేసిన భక్తుడెవరు..? ఆయనకు కలిగిన అసౌకర్యం ఏంటి..? అనే వివరాలు ఆరా తీసింది. 






టీటీడీ వివరణ..
శ్రీవారి ఆలయం ముందే మంత్రి ఆనంను భక్తులు నిలదీశారంటూ వార్తలు రావడంతో టీటీడీ అప్రమత్తమైంది. క్యూలైన్లను ఈవో శ్యామలరావు తనిఖీ చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, సర్వదర్శనం క్యూలైన్ లో అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదం అందిస్తున్నారని, పాలు, మజ్జిగ కూడా టీటీడీ సిబ్బంది అందిస్తున్నారని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి క్యూలైన్లలో కూడా పాలు, మజ్జిగ ఇస్తున్నామని, గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారాయన. రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. దీనికోసం ప్రత్యేక మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేశామని వివరించారు. వారాంతాల్లో అంటే శుక్ర, శని ఆదివారాల్లో అధిక రద్దీ ఉంటుందని, దానికి అనుగుణంగా భక్తులు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఇక మంత్రి ఆనంకు భక్తుడు చేసిన ఫిర్యాదుని కూడా సీరియస్ గా తీసుకున్నట్టు చెప్పారాయన. 


సదరు భక్తుడి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజి పరిశీలించామని.. క్యూలైన్లలో అన్నప్రసాదం, పాలు, మజ్జిగ వితరణలో ఎలాంటి లోపం లేదని ఈవో శ్యామలరావు తెలిపారు. మంత్రికి కంప్లైంట్ ఇచ్చిన భక్తుడు అన్నప్రసాదం, పాలు తీసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయన్నారు. సదరు భక్తుడు ముందు రోజు రాత్రి 10:45 గంటలకు కృష్ణతేజ అతిథి గృహం వద్ద క్యూలైన్ లోకి ప్రవేశించాడని, రాత్రి 11కి అన్నప్రసాదం, ఉదయం 6 గంటలకు పాలు, 8 గంటలకు టిఫిన్, 10కి పాలు తాగారని.. ఉదయం 10:45 గంటలకు దర్శనం అయిపోయిన తర్వాత బయటకొచ్చి మంత్రికి కంప్లైంట్ చేశారని అన్నారు. దర్శనానికి ఎక్కువ టైమ్ పడుతుందన్న కోపంలో మంత్రికి అలా చెప్పామంటూ భక్తులు క్షమాపణ కూడా చెప్పారన్నారు ఈవో. నిజంగా సమస్యలుంటే పరిష్కరించడానికి టీటీడీ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇక సోషల్ మీడియాలో మహిళా మంత్రి కుటుంబ సభ్యులు తిరుమల అతిథి గృహంలో డ్యాన్స్ లు చేశారంటూ వైరల్ అవుతున్న వీడియోపై కూడా ఈవో స్పందించారు. ఆ ఘటన తిరుమలలో జరగలేదని క్లారిటీ ఇచ్చారు. తిరుమలపై ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని సూచించారు. 


Also Read: తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం గురించి తెలుసా! పూర్తి వివరాలతో స్పెషల్ స్టోరీ