తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో కొండపైన ప్రైవేటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తొలగించనున్నారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. ఇక నుంచి తిరుమలలో అన్ని తరగతులకు చెందిన భక్తులందరికీ ఒకే రకమైనటువంటి భోజనాన్ని అందించాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తులు ఎవరూ కూడా భోజనాన్ని డబ్బు వెచ్చించి కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు ఇంకొన్ని కీలక నిర్ణయాలను కూడా టీటీడీ బోర్డ్ తీసుకుంది.
త్వరలోనే తిరుమలో సర్వ దర్శనాలను పూర్తి స్థాయిలో గతంలో తరహాలో పునరుద్దరించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నట్లుగా చెప్పారు. తిరుమలలో మళ్లీ కొవిడ్‌కు ముందు ఉన్నటువంటి పరిస్థితులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ (Tirumala Budget) రూ. 3,096 కోట్లతో ఆమోదం తెలిపామని అన్నారు. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. భక్తుల అనుమతికి ఆధికారులు ఏర్పాట్లు చేశాక ప్రకటిస్తామని అన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని అన్నారు. తిరుపతిలోని చిన్న పిల్లల ఆసుపత్రిలో చిన్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని అన్నారు. 100 మందిలో 99 మంది పిల్లలకు శస్త్ర చికిత్సలు చేశామని అన్నారు. రూ. 230 కోట్లతో చిన్న పిల్లల ఆసుపత్రి (Children Hospital) ని నిర్మిస్తామని అన్నారు.
‘‘కరోనాకు ముందు ఏ విధంగా దర్శనాలు ఉన్నాయో వాటిని అమలు చేస్తాం. ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండు రోజుల్లో ప్రకటిస్తాం. అన్నమయ్య మార్గాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తాం. అటవీ శాఖ అనుమతులు వచ్చేలోపు తాత్కాలిక పనులు చేపడతాం. ప్రస్తుతం వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా నడక దారిని ఏర్పాటు చేస్తాం. శ్రీవారి ఆలయం(Srivari Temple)లోని మహాద్వారం, ఆనందనిలయం, బంగారువాకిలిలో బంగారు(Gold) తాపడం చేయాలని నిర్ణయించాం. మహాద్వారానికి తాపడం పనులు త్వరలో మొదలుపెడతాం. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేసేందుకు ఆగమ సలహాలు తీసుకుంటాం. శ్రీనివాస సేతుకు నిర్మాణానికి ఇప్పటి వరకు టీటీడీ రూ.100 కోట్లు ఇచ్చింది. మరో రూ. 150 కోట్లు డిసెంబర్ లోపు మంజూరు చేస్తాం.’’ అని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.