చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల గుంపు చేసిన దాడిలో టీడీపీ యువ నేత మారుపూరి రాకేష్ చౌదరి మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి రాకేష్ చౌదరి అత్యంత సన్నిహితుడు.
చంద్రగిరి మండలం చిన్నరామాపురం, కొంగరవారిపల్లెలో ఏనుగులు సంచరిస్తున్నాయని సమాచారం అందడంతో రాకేష్ చౌదరి అక్కడికి వెళ్లారు. మామిడి తోటలోకి వెళ్లి ఏనుగుల గుంపును తరిమే ప్రయత్నం చేయగా, అవి దాడి చేశాయి. ఏనుగుల దాడిలో రాకేష్ చౌదరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాకేష్ నారావారిపల్లె ఉపసర్పంచ్, చంద్రగిరి మండలం ఐటీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడిగా సైతం పనిచేశారు. రాకేష్ మృతితో నారావారిపల్లిలో విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు టీడీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. స్థానికులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాకేష్ చౌదరి మృతిపట్ల సంతాపం తెలిపిన పులివర్తి నాని, టీడీపీ యువనేత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కాగా, చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపుల దాడిలో తరచుగా రైతులు, గ్రామస్తులు ప్రాణాలు కోల్పోతున్నారు.