తిరుపతిలోని ఓ ప్రైవేటు పాఠశాలో చదువుకున్న ఐదు మంది విద్యార్థులు ఇటీవల అదృశ్యం అయిన ఘటన ఏపీ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అదృశ్యమైన ఐదుగురు విద్యార్థులు దాదాపు ఐదు రోజుల తరువాత ఆచూకీ లభ్యమైంది.  ఆగ్రాలో ఉన్నట్టు తిరుపతి వెస్ట్ పోలీసులు ఆదివారం సాయంత్రం గుర్తించారు. 


ఈనెల 9వ తేదీన నెహ్రూ నగర్‌లోని అన్నమయ్య ప్రైవేటు పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు స్కూల్‌లో పరీక్ష రాసిన తర్వాత  టిఫిన్ చేసేందుకు ఇంటికి వెళ్తున్నట్టు చెప్పి ఎటో వెళ్లిపోయారు. ఇంటికి పిల్లలు రాలేదని తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ఆరా తీస్తే అక్కడ కూడా లేరు. ఇందులో ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. విద్యార్థుల అదృశ్యం పై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం ఐదు ప్రత్యేక బృందలు ఏర్పాటు చేసి గాలించారు. 


రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ తెలియకపోవడంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. వారందరూ కూడా ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఉన్నట్టు వెస్ట్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.. వారు ఆగ్రాలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు తక్షణం ఆగ్రా పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థులను తీసుకువచ్చేందుకు తిరుపతి వెస్ట్ పోలీసులు హుటాహుటిన ఆగ్రాకు పయణమయ్యారు. 


సోమవారం సాయంత్రానికి విద్యార్థులు తిరుపతికి చేరుకోనున్నారు.. స్కూల్ నుండి ఎందుకు పరార్ కావాల్సిన వచ్చింది.. పరార్ అయ్యేందుకు వీరి వెనుక మరెవరైనా ఉన్నారా అనే విషయాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది..