Tirumala : తిరుమలలో శ్రీవారి హుండీలో కెమెరాలు వేశారు విజిలెన్స్ అధికారులు. తిరుమల ఆలయం ముందు అనధికారికంగా ఫొటోలు తీసుకున్న వారి కెమెరాలు లాక్కొన్న విజిలెన్స్ సిబ్బంది కెమెరాలను హుండీలో వేశారు.  కొండపై అనధికార ఫోటోగ్రాఫర్లు పెరిగిపోయారని, భక్తులను ఇబ్బంది పెడుతున్నారని విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదలు అందాయని, దీంతో తనిఖీలు నిర్వహించామని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి ఆలయం ముందు అనధికారిక ఫొటోగ్రాఫర్ల నుంచి కెమెరాలు స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా భక్తుల ఫొటోలు తీసి బిజినెస్ చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదులతో రెయిడ్స్‌ నిర్వహించిన విజిలెన్స్‌ అధికారులు ఫొటో గ్రాఫర్ల నుంచి కెమెరాలు లాక్కుని హుండీలో వేశారు. మరోసారి దొరికితే చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు టీటీడీ అధికారులు.



అనాధికార హాకర్లపై టీటీడీ కొరడా 


తిరుమలలో అనధికార హాకర్ల ఆగడాలను అడ్డుకుట్ట చేసేందుకు టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న గొల్ల మండపం నుంచి లడ్డూ అఖిలాండ వరకూ అనధికార హాకర్లు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. వచ్చే పోయే భక్తులను ఫొటోలు తీసుకోవాలంటూ కోరుతుంటారు. అయితే అనధికారికంగా లైసెన్స్ లేకుండా ఫొటోలు తీయడం తిరుమలలో నిషిద్ధం. దీనిని దృష్టిలో‌ ఉంచుకుని టీటీడీ విజిలెన్స్ గొల్ల మండపం నుంచి అఖిలాండ వరకూ ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టింది.  ఈ తనీఖీలు చేపట్టిన సమయంలో అనధికార హాకర్లు అధికంగా ఉండడం వారి వద్ద స్టిల్ కెమెరాలను లాకొన్ని వాటిని అఖిలాండం వద్ద గల హుండీలో వేశారు. దాదాపుగా ఇరవై కెమెరాలను హుండీలో వేయడం ఇదే తొలిసారిగా తెలుస్తుంది. 


నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 


శ్రీవారి ఆలయం ముందు ప్రాంతంలోనే కాకుండా లడ్డూ కౌంటర్, అన్నదాన సత్రం, తిరుమాఢ వీధులు, షాపింగ్ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో అనధికార హాకర్లు స్టిల్ కెమెరాలను చేత పట్టుకుని వచ్చే పోయే భక్తులను ఫొటోలు దిగాలని విసిగిస్తూ ఉంటారు. ఈ తరుణంలో కొందరు భక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు బృందాలుగా ఏర్పడి అనధికార హాకర్ల ఆట కట్టించారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా స్టిల్ కెమెరాలతో ఫొటోలు చిత్రీకరించి భక్తుల వద్ద నుంచి నగదు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతూ వస్తుంది. అయితే తిరుమలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఉన్నఫలంగా అనధికార హాకర్ల నుంచి కెమెరాలను స్వాధీనం చేసుకుని శ్రీవారి హుండీలో వేశారు. మరోసారి అనధికారికంగా స్టిల్ కెమెరాలను ఉపయోగించి భక్తులను ఫోటోలు తీసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. లైసెన్స్ ఉన్న వారు మాత్రమే వారి వారికి కేటాయించిన ప్రాంతాల్లో ఫోటోలు తీసుకోవాలని హుక్కుం జారీ చేశారు. అంతే కాకుండా వివిధ ప్రాంతాల్లోని ఉన్న ఫోటో స్టూడియోలను తనిఖీ చేసి విజిలెన్స్ అధికారిలు లైసెన్స్ ను పరిశీలించారు. 


తిరుమలలో భక్తుల రద్దీ 


 శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం 12-11-22న స్వామి వారిని 73,323 మంది దర్శించుకోగా, 41,041 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఇక స్వామి వారికి భక్తులు కానుకల హుండీ రూపంలో 3.20 కోట్ల రూపాయలు లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయి శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్స్ లో వేచి‌ ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 40 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. ఎడతెరపి‌ లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా తిరుమల పార్వేటి మండపంలో నిర్వహించాల్సిన కార్తీక వనభోజనోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. వైభవోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించనుంది.


 


Also Read : Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్, వర్షం కారణంగా టీటీడీ కీలక నిర్ణయం