Tirupati News: తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ హాస్పిటల్ లో వైద్యులు ఈ రోజు ఓ అరుదైన ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు. 15 సంవత్సరాల చిన్నారికి గుండె మార్పిడి చికిత్స చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ హాస్పిటల్ లో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖపట్నంలో దాత నుంచి సేకరించిన గుండె తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి అమర్చుతున్నారు. 


విశాకపట్నానికి చెందిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి అయిన ఆనందరావు తన భార్య జంజూరు సన్యాసమ్మ (48) తో కలిసి సంక్రాంతి పండగకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ పై ఉన్న సన్యాసమ్మ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో సన్యాసమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆనందరావు, సన్యాసమ్మను స్థానిక ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్రమంలోనే సన్యాసమ్మ బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఈ నెల 16వ తేదీ నుంచి బ్రెయిన్ డెడ్ అయిన సన్యాసమ్మకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జీవన్ దాన్ సభ్యులు ఆ కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లి అవయవదానం గురించి అవగాహన కల్పించారు. అవయవ దానం చేస్తే చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న కొందరినైనా బతికించవచ్చని వారికి వివరించడంతో ఆ కుటుంబసభ్యులు అవయవదానానికి ఒప్పుకున్నారు. సన్యాసమ్మ గుండెను అన్నమయ్య జిల్లా కేఎస్ అగ్రహారానికి చెందిన విశ్వేశ్వర్ అనే 15 ఏళ్ల బాలుడికి ఇచ్చేందుకు సన్యాసమ్మ కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. 




విశాఖపట్నం నుండి తిరుపతికి గుండె తరలించడానికి వైద్యులు, అధికారులు, పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. విమానంలో గుండెను రేణిగుంటకు తీసుకురాగా అక్కడి నుంచి ట్రాఫిక్ అంతా నిలిపివేసి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి హుటాహుటినా పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ కు తరలించారు. అప్పటికే పద్మావతి హాస్పిటల్ లోని వైద్యులు ఆపరేషన్ కు అవసరమయ్యే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం సన్యాసమ్మ గుండెను పిల్లాడికి అమర్చుతోంది. టీటీడీ శ్రీ పద్మావతి పిల్లల హృదయాలయం ఆసుపత్రిని గతేడాది అక్టోబర్ 11 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడి వైద్య నిపుణులు ఎన్నో క్లిష్ట, అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వెయ్యి మంది చిన్నారులకు శ్రీపద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్ పునర్జన్మ ప్రసాదించింది.