టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రకు ఆంక్షలు విధించామని వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు.  శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మాడ వీధుల్లో పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. 


టీడీపీ నేత లోకేష్ శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి వస్తే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, దర్శన విషయంలో ఆకంక్షలు విధించలేదని ఎస్పీ తెలిపారు. అయితే శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం 800 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశామని, లోకేష్ కొనసాగిస్తున్న యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులను ఎక్కడా మోహరించలేదన్నారు. లోకేష్ పాదయాత్రకు 50 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. మహా శివరాత్రికి తిరుపతి జిల్లా పరిధిలోని ప్రధాన శైవక్షేత్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, శైవ క్షేత్రాలకు భక్తులు పెరిగే అవకాశం ఉన్న సందర్భంగా తాము అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.


శ్రీకాళహస్తిలో యువగళం బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఆద్యంతం అదిరిపోయే పంచులతో లోకేష్ ప్రసంగిస్తుంటే ప్రజలు చప్పట్లు ఈలలతో హోరెత్తించారు. పాదయాత్రలో భాగంగా శ్రీకాళ‌హ‌స్తి శివారు రాజీవ్ న‌గ‌ర్లో టిడిపి ప్రభుత్వ హ‌యాంలో క‌ట్టిన టిడ్కో ఇళ్లను లోకేష్ పరిశీలించారు. టిడ్కో ఇళ్లు త‌మ‌కు అంద‌జేయాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న తెలుపుతున్న ల‌బ్ధిదారుల‌కు లోకేష్ సంఘీభావం ప్రకటించారు. 






టీడీపీలో చేరిన మహాసేన రాజేష్


తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు ఇటీవల షాకిచ్చిన మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలతో భేటీ అయిన మహాసేన రాజేష్ శుక్రవారం ప్రతిపక్ష పార్టీ కండువా కప్పుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో దళిత సామాజికవర్గంతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహాసేన రాజేష్ కు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. 


టీడీపీలో చేరిన అనంతరం మహాసేన రాజేష్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబును దళిత ద్రోహి అని చిత్రీకరించి వైఎస్ జగన్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తాము అప్పటి ప్రతిపక్షనేత జగన్ మాటలు నమ్మి చంద్రబాబును అపార్థం చేసుకున్నట్లు తెలిపారు. దళిత ద్రోహి ఎవరూ, దళితులకు అన్యాయం చేస్తున్నది ఎవరో తాము త్వరగానే గ్రహించామని మహాసేన రాజేష్ అన్నారు. చంద్రబాబు ఏపీలో ఎస్సీల కోసం 27 సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తుచేసుకున్నారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆ పథకాలను రద్దు చేశారని చెప్పారు. గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు తప్పు చేయకుండా ఉండి, టీడీపీని గెలిపించి ఉంటే ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయ్యేదన్నారు. జగన్ తుగ్లక్ పాలన చూసిన తరువాతే ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతున్నాయని, చీకటి వచ్చిన తరువాతే వెలుగు విలువ తెలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని దీమా వ్యక్తం చేశారు.