ఎన్నికల దగ్గర పడుున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు సరికొత్త పంథాలో సాగుతున్నాయి. ఇన్నాళ్లు గ్రామాల యూనిట్‌గా రాజకీయాలు జరిగేవి. ఇప్పుడు అది కాస్త కుటుంబాలను యూనిట్‌గా తీసుకొని పాలిటిక్స్‌ను స్టార్ట్ చేస్తున్నాయి పార్టీలు. వైసీపీ గృహసారథుల పేరుతో ప్రజల ముంగిటకు వెళ్తుంటే ఇప్పుడు దానికి పోటీగా సాధిక సారథుల పేరుతో తెలుగుదేశం ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తోంది. 


ఇలాంటి వ్యవస్థలను 2014లోనే టీడీపీ తీసుకొచ్చింది. అప్పట్లో జన్మభూమి కమిటీలు ప్రవేశ పెట్టింది. ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పథకాలు అందేలా చూడాలన్నది ఆ కమిటీ ముఖ్య ఉద్దేశం. అయితే వాళ్లకు ఎలాంటి జీతభత్యాలు లేకుండా పని చేయాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారు. వాళ్ల అక్రమాలతో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చారు. 2019లో టీడీపీ ఓటమిలో ఈ కమిటీ పని తీరు కూడా ప్రధాన కారణమైంది.  


2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ... గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్ల పేరుతో కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతి యాభై కుటుంబాలకు వాలంటీర్‌ను పెట్టారు. ప్రభుత్వం నుంచి నెలకు ఐదు వేల వేతనం ఇస్తూ పని చేయించుకుంటున్నారు. వీళ్ల నియామకానికి అధికారికంగా నోటిఫికేషన్ ఇచ్చి స్థానికంగా ఉండే వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ వ్యవస్థపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆరోపణలు సవరించుకుంటూ ప్రభుత్వం ఆ వ్యవస్థ కళ్లూ చెవుళ్లుగా భావిస్తోంది. ప్రతి ఏటా వాళ్లలో ఉత్తమ పని తీరు కనబరిచిన వాళ్లను సన్మానిస్తోంది. 


వాలంటీర్‌ వ్యవస్థ అధికారికంగా ప్రభుత్వం తరఫున పనిచేయాలి. అందుకే పార్టీ పథకాలను, ప్రణాళికలు చెప్పేందుకు వైసీపీ గృహసారథులు అనే వ్యవస్థను తీసుకొచ్చింది. దీని నియాకమ ప్రక్రియ వేగంగా చేస్తోంది. వాంలటీర్‌కు సమానంగా ఈ గృహసారథులను నియమించాలని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వం తరఫున వాలంటీర్‌లు కార్యక్రమాలు చేపడితే... పార్టీ తరఫున గృహసారథులు పార్టీ తరఫున కార్యక్రమాలు చేపట్టనున్నారు. 


ప్రతి ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఈ గృహసారథులను వైసీపీ వాడుకోనుంది. ప్రతి కుటుంబంతో పది నుంచి పదిహేను నిమిషాలు మాట్లాడి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తీసుకొచ్చిన పథకాలు, రాష్ట్రంలో, ఆయా కుటుంబాల్లో వచ్చిన మార్పులు, గతంలో ఉన్న దుస్థితి వివరిస్తారు. ప్రతి ఓటు తమకే పడేలా ప్లాన్ చేస్తారు. 


వైసీపీ తీసుకొచ్చిన గృహసారథులకు కౌంటర్‌గా తెలుగుదేశం సాధికారిక సారథులు తీసుకొస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ వ్యవస్థ గురించి  వివరించారు. తాము తీసుకొస్తున్న వ్యవస్థలో మహిళల కోసం మహిళను, పురుషులతో మాట్లాడేందుకు పురుషులను నియమించబోతున్నట్టు వివరించారు. వీళ్లు కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం ఇస్తున్నది ఎంతా... తీసుకుంటున్నది ఎంతా అనేది వివరించనున్నారు. 


ఇలా వైసీపీ, టీడీపీ మధ్య సరికొత్త వార్ మొదలైనట్టు కనిపిస్తోంది. ప్రతి కుటుంబంలో ఉన్న ఓట్లను టార్గెట్‌గా చేసుకొని రెండు పార్టీలు సరికొత్త కార్యక్రమాలు తీసుకొచ్చాయి. దీంతో రాజకీయం ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.