BRS Seats For Sittings : సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తప్పనిసరిగా మార్చాల్సిన ఓ ఆరేడుగురికి తప్ప అందరికీ మళ్లీ టిక్కెట్లు వస్తాయన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. నియోజకవర్గాల్లో పనులు చేసుకుంటున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న నివేదికలు ఉన్నాయి. మరి దీనిపై కేసీఆర్ ఎలా వర్కవుట్ చేస్తారన్నది బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. బీఆర్ఎస్‌కు ఏవైనా ప్రతికూల ఫలితాలు వస్తే అది ఖచ్చితంగా ఎమ్మెల్యేల పై ఉన్న వ్యతిరేకత వల్లేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీన్ని కేసీఆర్ ఎలా అధిగమిస్తారన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు కేసీఆర్ అభ్యర్థులపై కూడా పూర్తి కసరత్తు చేశారు. అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకుని రంగంలోకి దిగారు. తనకున్న రాజకీయ అనుభవంతో ఎక్కడా వెనుతిరిగి చూడకుండా రెండోసారి విజయాన్ని అందుకున్నారు. ముందస్తు ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా ఎదుర్కొనేందుకు ప్రస్తుతానికి బీఆర్‌ఎస్ నియోజకవర్గస్థాయి కమిటీలు అన్ని కోణాల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు- ఇస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఎమ్మెల్యేలంతా రెండు నెలల క్రితమే ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్ళిపోయారు. కేసీఆర్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించినా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు టెన్షన్ పడుతున్నారు. దీనికి కారణం తమపై నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందన్న నివేదికలే.
ప్రభుత్వంపై సానుకూలత పెంచేందుకు కేసీఆర్ ప్రయత్నాలు
ఎమ్మెల్యేలను మారిస్తే కొత్త ఇబ్బందులు వస్తాయని ఉన్న వారినే నిలబెట్టి ఎలాగైనా గెలిపించుకోవాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. వరుసుగా నియోజకవర్గాల పరిస్థితులపై సర్వేలు చేయిసున్నారు. ఆ మేరకు పరిస్థితులను చక్కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులపై వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉందనే సంకేతాలు రావడంతో వారు కూడా అలర్ట్ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. వరుసగా గెలుస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనా జనాలకు కొంత విరక్తి ఉండే అవకాశం ఉంది. మార్పు వస్తే మంచిదని భావనతో ఉన్న కొద్ది నియోజకవర్గాల్లో ఆ అభిప్రాయాలు జనాల్లో ప్రబలకుండా మళ్ళీ గెలిపించుకునే విధంగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులకు పార్టీ నుంచి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం జరుగుతోంది.
ఆశావహులకు ఏదో విధంగా సర్దుబాటు !
కొన్ని స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ.. ఇదిప పరిమితమే. గతంలో కంటే ఈసారి పార్టీ నుంచి పోటీ చేస్తామని భావిస్తున్న నాయకుల సంఖ్య అధికంగా ఉంది. ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చినవారితో పాటు సొంత పార్టీలోనే ఏళ్లుగా టికెట్‌ను ఆశిస్తున్నవారు కూడా ఉన్నారు. ఇప్పటికే కొందరు ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనడం, సొంత కేడర్‌ను తయారు చేసుకోవడం వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. సిట్టింగులకే సీట్లు ఇస్తే తమ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా వారిలో ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి వారు ఇతర పార్టీల్లో చేరకుండా బీఆర్ఎస్ హైకమాండ్ ... గోప్యత పాటిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో మార్పులుంటాయని సంకేతాలు ఇస్తోంది.