Software Engineer Murder: తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ నాగరాజు హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజును హత్య చేసిన వారిలో పరారీలో ఉన్న బొప్పరాజుపల్లికు చెందిన రమేష్, గోపి, కుమార్ లు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న, బ్రాహ్మణపల్లె సర్పంచ్ చాణక్య ప్రతాప్ కోసం గాలింపు కొనసాగుతోందని ఏఎస్పీ వెంకట్రావు తెలిపారు. 


హత్యకు ముందు రిపుంజయ, మృతుడు నాగరాజు, తమ్ముడు పురుషోత్తం ముగ్గురు కలిసి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఇందులో రిపుంజయ నాగరాజుతో మాట్లాడుతూ పురుషోత్తం తన భార్యతో అక్రమసంబంధం పెట్టుకుంటాడా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. వాడిని వదిలేదే లేదు వాడి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు రిపుంజయ్. డబ్బు సంపాదిస్తే గర్వం వస్తుందా.. పురుషోత్తాన్ని అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో రిపుంజయపై తిరగబడ్డ నాగరాజు.. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు వస్తానంటూ రిపుంజయకు వార్నింగ్ ఇచ్చాడు. ముందు తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అంటూ రిపుంజయకు నాగరాజును గట్టిగా అడిగాడు. అక్రమసంబంధంలో విషయంలో తమ్ముడిని మందలించాల్సింది పోయి నాగరాజు రిపుంజయకే వార్నింగ్ ఇవ్వడంతో కోపోద్రిక్తుడైన రిపుంజయ పథకం ప్రకారం నాగరాజును చంపినట్లు ఈ ఆడియో ద్వారా తెలుస్తోంది.


మహిళతో సంబంధం పెట్టుకున్న పురుషోత్తం..


నాగరాజు (36) బెంగళూరులో సాఫ్ట్‎వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు తమ్ముడు పురుషోత్తం. పురుషోత్తం స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ ఆ ఊరి సర్పంచ్‌ చాణక్యకు మరదలు (తమ్ముడి భార్య). కరోనా వల్ల లాక్ డౌన్ పెట్టిన సమయంలో వీరిద్దరికీ వివాహేతర సంబంధం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మహిళ బంధువులకి పురుషోత్తంకి మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. ఇకపై గొడవలు లేకుండా చేస్తామని నమ్మించి అన్న నాగరాజును మద్యం తాగించటానికి తీసుకువెళ్లి హత్య చేశారని భావిస్తున్నారు. అయితే, నాగరాజును సర్పంచ్‌ చాణిక్య హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామ సర్పంచ్‌ చాణిక్య నాగరాజుతో మాట్లాడాలని పిలిపించి.. మాటల సందర్భంగా ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


నాగరాజును కొట్టి, కాళ్ళు చేతులు కట్టేసి, కార్ డోర్ లాక్ చేసి కారుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టి సజీవ దహనం చేసి ఉంటారని భావిస్తున్నారు. కారులో మంటలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. అప్పటికే కారు మంటల్లో కాలిపోయింది. మంటలు ఆర్పివేసి, అందులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. కారు నంబరు ప్లేటు, ఇతర ఆధారాలతో చనిపోయింది నాగరాజుగా గుర్తించారు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగరాజు హత్య అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన భార్య.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది. సంబంధం లేని విషయంలో నాగరాజును అకారణంగా చంపేశారని విలపించింది. నాగరాజును చంపిన వారిని శిక్షించకపోతే వారిని కూడా చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.