తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో అపశ్రుతి జరిగింది. సాయంత్రం కురిసిన పెద్ద గాలి వానకు ఆలయ ఆవరణలో ఉన్న ధ్వజ స్తంభం వద్ద ఉన్న పురాతన రావి చెట్టు కూలిపోయింది. గాలికి ఒక్కసారిగా భారీ చెట్టు పక్కకు ఒరిగిపోవడంతో ఈ ఘటనలో ఒక భక్తుడు మృతి చెందాడు. మరో ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కడపకు చెందిన డాక్టర్ గుర్రప్పగా పోలీసులు గుర్తించారు. తిరుపతి స్విమ్స్‌లో మెడిసిన్ చదువుతున్న కుమార్తెను చూసేందుకు వచ్చిన గుర్రప్ప.. గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. గుర్రప్ప గతంలో స్విమ్స్‌లో వైద్యుడిగా సేవలందించారని, ప్రస్తుతం కడపలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. ఆలయ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కూలిన రావి చెట్టు వందల ఏళ్ల నాటి రావి చెట్టుగా స్థానికులు చెబుతున్నారు. స్వామివారి ఉత్సవాలకు సిద్ధం చేసిన గజరాజు అప్రమత్తతతో పెను ప్రమాదమే తప్పింది. చెట్టు కూలిపోవడానికి ముందుగానే పసిగట్టిన గజరాజు ఘీంకరించడంతో అప్రమత్తమై పరుగులు తీశామని భక్తులు అంటున్నారు.
చనిపోయిన వ్యక్తికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా - వైవీ సుబ్బారెడ్డి
‘‘గాలి వర్షం వచ్చిన నేపథ్యంలో గోవిందరాజస్వామి ఆలయంలో రావిచెట్టు పడిపోయింది. చెట్టు కూలడంతో కడప జిల్లాకు చెందిన వ్యక్తి డాక్టర్ గుర్రప్ప మృతి చెందారు. ఇది చాలా బాధ కారణమైన ఘటన. అ కుటుంబానికి జరిగిన బాధను భర్తీ చేయలేం. కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తున్నాం. ఒకరికి కాలు, మరొకరికి తలకు మరో ఇరువురి గాయాలు అయ్యాయి. మృతి చెందిన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిజేస్తున్నా. వందేళ్ళ నాటి చెట్టు భారీ గాలికి పడిపోయింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
బాణసంచా గోడౌన్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాళెం మండలం, ఎల్లకటవ గ్రామంలో బాణాసంచా గోడౌన్‌లో ప్రమాదం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. బాణా సంచా గోడౌన్‌లో ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించారు. మరణించిన వారంతూ చాలా పేదవాళ్లని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రోజువారీ కూలీలను సమాచారం తెలుసుకున్న సీఎం… ఈ విధంగా స్పందించారు. ఆయా కుటుంబాను ఆదుకునేలా ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఎక్స్‌గ్రేషియాను వారి కుటుంబాలకు అందించాలన్నారు.