Tirupati News: చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. స్థానిక బిజినెస్ సెంటర్‌ వద్ద శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత  పారిశ్రామికవాడ మౌళిక సదుపాయాలు, సుస్థిరత, హరిత హిత చర్యలు, ప్రగతి, ప్రత్యేకతల గురించి వివరించారు. ఈ పర్యటనపై డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్)లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య మరియు పెట్టుబడి భాగస్వామిగా సింగపూర్ ఎదుగుతున్న క్రమంలో కాన్సుల్ జనరల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. సింగపూర్ నుంచి శ్రీసిటీకి మరిన్ని పెట్టుబడులకు ఈ పర్యటన మార్గం సుగమం చేస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 


మరింత అభివృద్ధి చెందడానికి అవకాశమున్న ప్రాజెక్టు..


శ్రీసిటీలో ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, పెట్టుబడిదారుల స్నేహపూర్వక వాతావరణం పట్ల ఎడ్గార్ పాంగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మరింత అభివృద్ధి చెందడానికి అవకాశమున్న అద్భుతమైన ప్రాజెక్ట్ శ్రీసిటీ అంటూ ప్రశంసించారు. శ్రీసిటీలో కొన్ని సింగపూర్ కంపెనీలు ఉండటంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న సింగపూర్ కంపెనీలకు శ్రీసిటీ వ్యాపార సామర్థ్యాన్ని తెలిచేయనున్నట్లు పేర్కొన్నారు. శ్రీసిటీ అధికారులతో చర్చల సందర్భంగా  కాన్సుల్ జనరల్ పలు అంశాలపై ప్రశ్నలు అడిగి విషయాలు తెలుసుకున్నారు. వివిధ రంగాలలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక ప్రోత్సాహకాలు, శ్రీసిటీలో వ్యాపారం చేయడం వల్ల కలిగే నిర్దిష్ట ప్రయోజనాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఎంటర్‌ప్రైజ్ సింగపూర్ ప్రాంతీయ డైరెక్టర్ శబరీష్ నాయర్‌తో సహా అధికారుల బృందంతో కాన్సుల్ జనరల్ పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా శ్రీసిటీ పరిసరాలు వీక్షించడంతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్‌ను తయారు చేసే సింగపూర్‌కు చెందిన వైటల్ పేపర్‌ పరిశ్రమను సందర్శించారు.