TTD: టీటీడీ తిరుప‌తిని మెడిక‌ల్ హ‌బ్‌గా త‌యారు చేస్తోంద‌ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. స్విమ్స్‌లో రూ.1.95 కోట్లతో నిర్మించిన  రోగుల స‌హాయ‌కుల వ‌స‌తి భ‌వ‌నాన్ని గురువారం సాయంత్రం ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఆయ‌న ప్రారంభించారు. వ‌స‌తి భ‌వ‌నాన్ని ప‌రిశీలించి రోగుల స‌హాయ‌కుల‌తో మాట్లాడారు. అనంత‌రం వారికి అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్‌, బ‌ర్డ్‌, శ్రీ ప‌ద్మావ‌తి చిన్న పిల్లల హృద‌యాల‌యం, పేద‌ల‌కు విశేష వైద్య సేవ‌లు అందిస్తున్నాయ‌ని చెప్పారు.


టాటా క్యాన్సర్ ఆసుప‌త్రి, అర‌వింద కంటి ఆసుప‌త్రిని కూడా తిరుప‌తికి తీసుకురావ‌డానికి టీటీడీ త‌న వంతు స‌హ‌కారం అందించింద‌న్నారు. స్విమ్స్‌లో శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాల‌జీ, శ్రీ ప‌ద్మావ‌తి చిన్న పిల్లల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రుల నిర్మాణం వేగంగా జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. తిరుప‌తి న‌గ‌రంలో కార్పొరేట్ ఆసుప‌త్రుల కంటే మిన్నగా ఉచితంగా వైద్య సేవ‌లు అందిస్తున్నట్లు చెప్పారు. 


స్విమ్స్ లో వందలాది మంది రోగులు వైద్య చికిత్సలు పొందుతూ ఉంటార‌ని, వార్డుల్లోని వారి సహాయకులు వసతి కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉండటాన్ని తాను స్వయంగా గుర్తించి ఓపీ బ్లాక్ ఎదురుగా తాత్కాలికంగా షెడ్లు వేసి వారికి వసతి కల్పించామ‌న్నారు. ప్రస్తుతం రూ.2 కోట్లతో అన్ని వ‌స‌తుల‌తో ప‌క్కా భ‌వ‌నం నిర్మించామ‌ని, ఇక్కడ వారికి అన్నప్రసాదం కూడా అందించే ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. ఈ భ‌వ‌నంపైన మ‌రో రెండు అంత‌స్తులు నిర్మించ‌డానికి రూ.4.40 కోట్లు మంజూరు చేశామ‌ని చెప్పారు. రోజుకు క‌నీసం నాలుగైదు వందలు పెట్టి లాడ్జీలో రూములు తీసుకోలేని పేద‌ల‌కు ఈ వ‌స‌తి భ‌వ‌నం ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌న్నారు. 


క్యాన్సర్‌కు అత్యాధునిక వైద్య చికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు 2023 మే 25వ తేదీ రూ.124 కోట్ల వ్యయంతో శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజి ఆసుపత్రిలో కీలకమైన బంకర్‌ బ్లాక్‌ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశామ‌న్నారు. ఈ ఆసుపత్రిలో రూ.200 కోట్ల వ్యయంతో అత్యాధునిక యంత్రాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. అదేవిధంగా రూ.97 కోట్లతో కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణానికి త‌మ‌ పాల‌క‌మండ‌లి ఆమోదం తెలిపిందన్నారు. శ్రీ‌నివాస సేతు నిర్మాణ‌ప‌నుల్లో పాల్గొంటూ ఇద్దరు కూలీలు చ‌నిపోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఈ ప్రమాదం కార‌ణంగా గ‌డ్డర్ విరిగిపోయి నిర్మాణం ఆల‌స్యమైంద‌ని, ఈ నెలాఖ‌రుకు ప‌నులు పూర్తి చేసేలా చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. 


ఎస్వీ బాల మందిర్ అదనపు హాస్టల్ బ్లాక్ ప్రారంభం


అంత‌కుముందు రూ.10.75 కోట్ల‌తో నిర్మించిన ఎస్వీ బాల మందిర్ అదనపు హాస్టల్ బ్లాక్ భ‌వ‌నాన్ని వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డితో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మీడియ‌తో మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని పిల్లలను చేరదీసి చదువుతో పాటు చక్కటి వసతి, భోజన సదుపాయాలు టీటీడీ కల్పిస్తోంద‌ని, బాల‌మందిర్‌లో చ‌దువుకుని పీజీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఫీజులు చెల్లించ‌డం జ‌రుగుతోంద‌ని వివ‌రించారు. 5 ఫ్లోర్లతో ఈ కొత్త హాస్టల్ బ్లాక్ నిర్మించామ‌ని, విద్యార్థులు చదువుకోవడానికి, భోజనం చేయ‌డానికి ప్రత్యేకంగా హాళ్లు ఉన్నాయ‌ని చెప్పారు.