రాయలసీమ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కియా మోటర్స్ పరిశ్రమ వద్దకు వెళ్లారు. పెనుకొండ కియా కార్ల కర్మాగారం వద్ద  చంద్రబాబు సెల్ఫీ తీసుకొని సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. కరవు నేలపై ఎవరైనా కియా పరిశ్రమను ఊహించారా? అని చంద్రబాబు అడిగారు. అనంతపురం జిల్లాపై తనకున్న ప్రేమతోనే ఈ ప్రాజెక్టు తీసుకొచ్చానని చెప్పారు. కేవలం ఆరు నెలల్లోనే గొల్లపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి కియా పరిశ్రమకు నీళ్లు ఇచ్చామని చంద్రబాబు వివరించారు. ఇక్కడి కరవు సీమలో కియా పరిశ్రమ సిరులు పండిస్తోందని, ఇది పూర్తిగా టీడీపీ విజయమే అని అన్నారు. 


కియా కార్ల అమ్మకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.వేల కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు. కియాలో 10 లక్షల కార్లు ఉత్పత్తి చేసిన సందర్భాన్ని ఘనంగా జరుపుకున్నారని, ఆ సమయంలో బాలయ్య సాంగ్ పెట్టి మాత్రమే అందరూ డాన్స్ చేశారని గుర్తు చేశారు. కియా పరిశ్రమ వల్ల 13 వేల మందికి నేరుగా, మరో 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరికిందని వివరించారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఒక రోడ్డైనా వేశారా అని ప్రశ్నించారు. భావితరాలకు ఏం కావాలో అని ఆలోచించేది తన విధానమని, విధ్వంసం చేయడం ముఖ్యమంత్రి జగన్ విధానమని అన్నారు.


స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ పైన కూడా చంద్రబాబు సెటైర్లు వేశారు. ఆయన ఎప్పుడు బట్టలు విప్పి రోడ్డుపైకి వస్తాడేమోనని తనకే భయం వేస్తోందని ఎద్దేవా చేశారు. ఆయన ది గ్రేట్ ఎంపీ అని ఎగతాళి చేశారు. ‘‘బట్టలు విప్పేసి సరసాలు ఆడతారు. ఫోన్లో మాట్లాడుతారు. అలాంటి వెధవలంతా ఎంపీలు అయ్యారు. కియా పరిశ్రమ వద్దకు వచ్చి తుపాకీ చూపించి బెదిరింపులకు గురిచేస్తారు. మీ కథ తెలుస్తానని బెదిరిస్తారు. ఏం తెలుస్తావయ్యా నువ్వు..?’’ అని చంద్రబాబు మాట్లాడారు.