Tirupati District Crime news: తిరుపతి జిల్లా అనేది పేరు మాత్రమే కాదు... తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, సూరుళపేట ఇలా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, స్థలాలు, పర్యటక ప్రాంతాలు, ఎంతో మంది ప్రముఖుల సొంత గ్రామాలు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రతిరోజు వచ్చి వెళ్లే ప్రాంతం. ఈ ప్రాంతంలో పోలీస్ శాఖ విధులు నిర్వహించడం చాలా కష్టంతో కూడుకుంది. ఒక పక్క భద్రతతో పాటు ప్రముఖుల పర్యటన, లా అండ్ ఆర్డర్.. ఇలా అనేక ఇబ్బందులు నడుమ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చోరులు, హంతకులు పోలీసులకు సవాల్ విసిరినట్లు కేసుల నమోదవుతున్నాయి.


పెరిగిన దొంగతనాలు 
తిరుపతి జిల్లా వ్యాప్తంగా నేర పరిస్థితి ఒకసారి పరిశీలిస్తే.. ఇటీవల పట్టణ ప్రాంతాల్లో, పట్టణ శివారు ప్రాంతాల్లో దొంగతనాలు పెరిగిపోయాయి. అటు వైపు పోలీసుల నిఘా తక్కువగా ఉండడం... రౌండ్స్ కు వెళ్లిన వారు సైతం పర్యవేక్షణ సరిగ్గ లేకుండా పోవడం.... వెళ్లిన ఏదొక్క ప్రాంతంలో ఉండిపోవడం జరుగుతుందని విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఏదైనా అవసరమై 100 ఫోనే చేసిన సకాలంలో స్పందన లేదని, ఆలస్యంగా స్పందించే ఘటనలు కూడా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. పోలీస్ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం... పోలీస్ రౌండ్స్ ఒక్కసారి వచ్చి పోయిన తరువాత దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని, దొరికిన దొంగలు చెప్పారని పోలీస్ విభాగాల నుంచి సమాచారం.


పెరిగిన హత్యలు
పోలీసులకు మరో సవాల్ హత్యలు, ఆత్మహత్య, మిస్సింగ్ కేసులు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు మిస్సింగ్ కేసు ఒక్కటైన నమోదు అవుతుంది అంటే ఆశ్చర్యం వేయదు. ఇలా మిస్సింగ్ కేసులు పరిష్కారం, చర్చలకే సమయం సరిపోతుంది. మరొక్కటి ఆత్మహత్యలు. ఆత్యహత్య లు వాటి పోస్టుమార్టం, అందులో ఏదైన కుట్ర కోణం అనేది తెలుసుకునేది పోలీసుల పనే. ఇక హత్యలు విషయానికి వస్తే... ప్రతి నెలా జరిగే క్రైం మీటింగ్ లో హత్యల గురించి ఉన్నతాధికారులు మాట్లాడే పరిస్థితి. జిల్లాలో హత్యలు రోజు రోజుకు పెరుగుతోంది అనేది సమాచారం.


గంజాయితో సమస్యలు
జిల్లా వ్యాప్తంగా గంజాయి తాగే వారు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలా ప్రాంతంలో యువత, విద్యార్థులు టార్గెట్ గా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. పోలీసులు గంజాయి తరలించే వారిని పట్టుకున్నాము... గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు. కానీ గంజాయి, మత్తు పదార్థాలు ఎక్కడి నుండి వస్తున్నాయి. పండించేది ఎవరు అని కేసులు నమోదు కావడం లేదని వినిపిస్తోంది. ఈ గంజాయి కారణంగా అనేక మంది జీవితాలు మరణానికి దారి తీస్తున్నాయి... మరికొంతరు మత్తుకు బానిసలుగా మారి, డబ్బు సరిపోకుండా చెడు అలవాట్లను వదులుకోలేక దొంగతనాలు, హత్యలు చేసి జైలుకు వెళ్తున్నారు. మత్తు దిగాక తమ తప్పు తెలుసుకుని తిరిగి బయటకు రాలేక సతమతమవుతున్నారు.


తిరుచానూరులో చెడ్డి గ్యాంగ్ 


తిరుపతి పట్టణానికి అతి సమీపంలోని తిరుచానూరులో గురువారం రాత్రి చెడ్డీ గ్యాంగ్ కదలికలు ఆ ప్రాంత వాసులను కలవరపెడుతున్నాయి. తిరుచానూరులో కొత్తపాలెం లే అవుట్లో ఓ ఇంట్లో చోరీ గురువారం రాత్రి ముగ్గరు చెడ్డీ గ్యాంగ్ ప్రహరీగోడ దూకి బీరువాలోని నగలు, నగదు అపహరణ చేశారు. మారణాయుధాలతో వచ్చిన ముగ్గురు దొంగలు గోడ దూకి వెళ్లడం సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డైంది. బాధితుడి ఫిర్యాదుతో తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.