Tirumala Latest News: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది టీటీడీ. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకూ ఈ ఆలయ శుద్ది కార్యక్రమం జరగనుంది.


సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని టీటీడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అధికారులు. ముందుగా స్వామి వారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేసి, ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామపుకోపు, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసిన అనంతరం స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను ఉదయం 11 గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు.  


ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ. జనవరి 2వ తేదీన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఏడాదిలో ఉగాది, ఆణివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ వస్తోందని అన్నారు. సుగంధ ద్రవ్యాలతో ఏర్పాటు చేసిన పరిమళాన్ని స్వామి వారికీ సమర్పించి, ఆలయ గోడలపై పూతగా పూయడం జరిగిందన్నారు.


ఆలయ శుద్ధి అనంతరం శ్రీవారికి నైవేద్యం సమర్పణ అనంతరం భక్తులను ఉదయం 11 గంటలకు దర్శనానికి అనుమతిస్తామని ఆయన అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ బోర్డు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని, టైం స్లాట్ టోకెన్స్ ను భక్తులకు ఇస్తే, ఏ భక్తుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారిని దర్శించుకోవచ్చని ఆయన తెలిపారు. ఒక లక్ష యాభై వేలు స్పెషల్ ఎంట్రీ టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేసామని, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 9 కౌంటర్లలో వైకుంఠ ద్వారా దర్శనాలు జారీ చేస్తామని ఆయన ప్రకటించారు.


రోజుకు 50 వేల టిక్కెట్లను సర్వదర్శనం టైం స్లాట్ టిక్కెట్లను ఇవ్వనున్నామని, 5 లక్షల టోకెన్స్ పూర్తి అయ్యే వరకు టోకెన్స్ జారీ కొనసాగుతుందని అన్నారు. భక్తులందరూ టీటీడీకి సహకరించాల్సిందిగా కోరుతున్నామని, రిపోర్టింగ్ టైం ప్రకారం క్యూలైన్లో చేరుకుంటే త్వరితగతిన స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు.