Vaikunta Dwara Darshan Tokens Registration: తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దీనికి సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో పెట్టింది. ఇవాల్టి నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ రెండో తేదీని ఈ డిప్ తీస్తారు. ఈ డిప్‌లో ఎంపికైన భక్తులకు మెసేజ్ పంపిస్తారు. వారి దర్శన తేదీని, సమయాన్ని తెలియజేస్తారు. ఈసారి కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ ఛైర్మన్ ప్రకటించారు.
పది రోజుల పాటు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది జరిగిన దుర్ఘటనను దృష్టిలో పెట్టుకొని సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది. అందుకే దర్శనాల కోసం మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్, ప్రభుత్వ వాట్సాప్ సర్వీసెస్ ద్వారా రిజిస్ట్రేషన్ కావచ్చు.
వైకుంఠ ద్వార దర్శనంలో దాదాపు 182 గంటల పాటు స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుందని ఇందులో అధిక భాగం సామాన్య భక్తులకే ఉంటుందని టీటీడీ ప్రకటించింది. 164 గంటల దర్శన సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ ప్రకటించారు. తిరుమల వచ్చిన భక్తులు టీటీడీ సూచనలు పాటిస్తూ క్రమపద్ధతిలో నడుచుకుంటే దర్శనం సాఫీగా సాగుతుందని ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు.
వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై సీఎం సమీక్ష
రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో కొలువై ఉన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. రూ.260 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం రూపుదిద్దుకోనుంది. మొదటి దశ పనులు రూ. 140 కోట్లతో చేపడతారు. రూ. 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మిస్తారు. ఏడంతస్తుల సువిశాల రాజగోపురం కట్టనున్నారు. ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపాలు రూపుదిద్దుకోనున్నాయి. శ్రీవారి సేవలో భాగంగా ప్రియ భక్తుడైన ఆంజనేయస్వామివారికి ప్రత్యేక ఆలయం నిర్మిస్తారు. రెండో దశలో రూ. 120 కోట్లతో మాడ వీధులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, నిత్య అన్నదానానికి అనువుగా సువిశాలమైన భవనం, విశ్రాంతి భవనం, అర్చక-సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ నిర్మాణం చేపడతారు.
శంకుస్థాపన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సీఎం చంద్రబాబును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలవనున్నారు. ముఖ్యమంత్రి గతంలో సూచించిన పనుల పురోగతి, వైకుం ఏకాదశి ఏర్పాట్లపై భక్తులకు కల్పించిన సౌకర్యాలు, ఇతర విషయాలపై ఆరా తీస్తారు.