శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అందుబాటులో 1189 మంది క్షురకులు..
వీరిలో 214 మంది మహిళా క్షురకులు..
Tirumala Salakatla Brahmotsavam 2022: శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు సత్వర సేవలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడా ఆలస్యం లేకుండా మొత్తం 1189 మంది క్షురకులు మూడు షిఫ్టుల్లో భక్తులకు సేవలందించేలా ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. వీరిలో 214 మంది మహిళా క్షురకులు ఉన్నారు. రెండేళ్ల తరువాత ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు జరుగనుండడంతో విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశముందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది టీటీడీ.
అందుబాటులో మినీ కల్యాణకట్టలు..
తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతో పాటు 10 మినీ కల్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. మొత్తం రెగ్యులర్ క్షురకులు 337 మంది కాగా వీరిలో 336 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. మొత్తం పీస్ రేటు క్షురకులు 852 మంది కాగా వీరిలో 639 మంది పురుషులు, 213 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 1189 మంది క్షురకులు, ముగ్గురు సూపరింటెండెంట్‌లు, ముగ్గురు అసిస్టెంట్‌లు, 20 మంది రెగ్యులర్ మేస్త్రీలు, 46 మంది సహాయక సిబ్బంది మూడు షిఫ్టుల ద్వారా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రధాన కల్యాణకట్టతో పాటు, పిఏసి-1, పిఏసి-2, పిఏసి-3, శ్రీ వేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దగల మినీ కల్యాణకట్టలు 24/7 పని చేస్తున్నాయి. జిఎన్‌సి, నందకం విశ్రాంతి గృహం, హెచ్‌విసి, కౌస్తుభం, సప్తగిరి విశ్రాంతి గృహం మినీ కల్యాణకట్టలు ఉదయం 3 నుండి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. వీటిలో సోలార్ వాటర్ హీటర్‌తో వేడినీటి సౌకర్యం ఉంది. యాత్రికులు స్నానం చేయడానికి స్నానపు గదులు అందుబాటులో ఉన్నాయి.
ఉచితంగా కంప్యూటరైజ్డ్ టోకెన్
క్షురకులకు బ్లేడ్లు, డెటాల్, అప్రాన్‌లు, హ్యాండ్ గ్లౌజ్‌లు, యూనిఫాం, పిపిఇ కిట్లు, మాస్కులు అందిస్తున్నారు. చర్మ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి యాంటీ సెప్టిక్ లోషన్ వినియోగిస్తున్నారు. అన్ని కళ్యాణకట్టల్లో యాత్రికులకు ఉచితంగా కంప్యూటరైజ్డ్ టోకెన్ అందజేస్తారు. తగినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా కల్యాణకట్టల్లోని హాళ్లన్నింటినీ నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతుంది టీటీడీ.
శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం 10-09-2022న స్వామి వారిని 80,741 మంది దర్శించుకోగా,41,494 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఇక స్వామి వారికి భక్తులు కానుకల హుండీ రూపంలో 4.22 కోట్ల రూపాయలు లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టమెంట్లు భక్తులతో నిండి పోవడంతో బయట నందకం గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి దర్శనానికి 28 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీతో ఏడుకొండలు గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. బయట క్యూలైన్స్ లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి అసౌఖర్యం కలుగకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రద్దీ దృష్ట్యా భక్తులు ఒపికతో స్వామి వారి దర్శనం పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తొంది.