Tirumala News | తిరుమల శ్రీవారి పుష్కరిణి నెల రోజుల తరువాత భక్తులకు అందుబాటులోకి రానుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి పుష్కరిణి లోకి భక్తులను అనుమతించడం నిలిపివేసారు. స్వామి వారి పుష్కరిణిలోని నీటిని తీసివేసి అడుగు భాగంలో ఉన్న ఇసుక, పాచిని సుమారు 100 మంది పారిశుధ్య కార్మికులు రాత్రి పగలు కష్టపడి శుభ్రం చేశారు.  పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు వేయడంతో కొత్త అందం వచ్చింది. అనంతరం కోటి లీటర్ల నీటితో పుష్కరిణిని నింపారు.


పుష్కరిణి హారతి
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి రోజు పుష్కరిణి హారతి జరిగేది. పుష్కరిణి మరమ్మతులు కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వ తేదీ వరకు పుష్కరిణి హారతి ని టీటీడీ నిలిపివేసింది. సెప్టెంబర్ 1 నుంచి భక్తులను పుష్కరిణిలో స్నానం కోసం అనుమతించడం తో పాటు పుష్కరిణి హారతిని తిరిగి ప్రారంభించనున్నారు.


4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం


లోక కళ్యాణార్థం టీటీడీ నిర్వహిస్తున్న చతుర్వేద పారాయణం లో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో 4వ విడత శుక్ల యజుర్వేద పారాయణం ప్రారంభించనున్నారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మధ్య వేద పండితులు శుక్ల యజుర్వేద పారాయణం చేయనున్నారు. జులై 1న ప్రారంభమైన సామవేద పారాయణం ఆగస్టు 31తో ముగిసింది.


తిరుమలలో విశేష పర్వదినాలు


కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు వివరాలు ఇలా  ఉన్నాయి. 


- సెప్టెంబరు 5న బలరామ జయంతి, వరాహ జయంతి.


- సెప్టెంబరు 7న వినాయక చవితి. తిరుమల రెండు ఘాట్ రోడ్స్ లోని వినాయక స్వామి వారి ఆలయాలో చవితి వేడుకలు జరుగుతాయి.


- సెప్టెంబరు 17న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం.


- సెప్టెంబరు 18న పౌర్ణమి శ్రీవారి గరుడసేవ.


- సెప్టెంబరు 28న సర్వ ఏకాదశి జరుగుతుంది. 


శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు


 తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. -  సెప్టెంబరు 3న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.


 - సెప్టెంబరు 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.


-    సెప్టెంబరు 18న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.


-   సెప్టెంబరు 26న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.