Tirumala News: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని జన్మలో ఒక్కసారైనా దర్శించాలని భక్తులు భావిస్తూ ఉంటారు. ఆనంద నిలయంలో సాలగ్రామ శిలగా అవతరించిన శ్రీనివాసుడు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్య మంగళ స్వరూప దర్శన భాగ్యం కోసం ప్రతి నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు వివిధ రూపాల్లో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేరుకున్న భక్తులకు వివిధ మార్గాల్లో స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటుంది టీటీడీ.
నడక మార్గం భక్తులకు 15 వేల టోకెన్లు జారీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి నడకమార్గం భక్తులకు దర్శన టోకెన్లను జారీ చేయనుంది. అలిపిరి నడక మార్గంలో 10 వేల మందికి, శ్రీవారి మెట్లు నడక మార్గంలో 5 వేల మంది భక్తులకు టోకెన్లను జారీ చేయనుంది. అయితే రేపు శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆళయంలో శ్రీరామ నవమి ఆస్థానం నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎల్లుండి శ్రీరామ ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరగనుంది.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - కంపార్టుమెంట్లనీ ఖాళీ
శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉండడంతో నేరుగా భక్తులను శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. దీంతో క్షణాల్లో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీనివాసుడికి ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదిస్తారు అర్చకులు. ఇక బుధవారం నాడు బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని అర్చకులు స్వామి వారి నైవేద్యంగా మొదటి గంటాలో సమర్పిస్తారు. మంగళవారం రోజున 70,605 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 24,947 మంది తలనీలాలు సమర్పించగా.. 4.79 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.
మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు..
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యూష కాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాస మూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్న ప్రసాదం, లడ్డూ, వడలు సమర్పించగా, ఇక బుధవారం నాడు "బెల్లం పాయసం" ను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.