Tirumala News: మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ అర్చకులు.. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అందించారు. అలాగే ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీస్సులతో దిగ్విజయంగా నాలుగు సంవత్సరాల సుపరిపాలన జరిగిందన్నారు. పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలా ఉండాలనే స్థాయికి వచ్చిందన్నారు. ప్రజల మనసుల్లో సీఎం జగన్ సుస్థిరమైన స్థానం సంపాధించుకున్నారని అన్నారు. ఏపిలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పిన ఆయన, అభివృద్ధి అంటే ఒకే చోట జరిగేది కాదని, అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాలకు, అన్ని గడపలకు వెళ్ళాలి అని జగన్ ధృడ సంకల్పంతో ఉన్నారని చెప్పారు.
2019 ఎన్నికల్లో సీఎంను ఆదరించని వారు కూడా నేడు సీఎం వైపు ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు బ్రహ్మాండంగా మంచి జరుగుతుందని మంత్రి జోగి రమేష్ చెప్పారు. ప్రజలంతా జగనన్న వెంట నడుస్తాంమంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు 2014లో 650 వాగ్దానాలు ఇచ్చినా అందులో కేవలం పది వాగ్దానాలు కూడా నెరవేర్చలేక పోయారని, చంద్రబాబు మేనిఫెస్టోను మడిచి జేబులో పెట్టుకొవాలని సూచించారు. అలాగే చంద్రబాబు మేనిఫెస్టోను చింపి నెత్తిన వేసి కొట్టుకో అని ప్రజలు చెబుతున్నారన్నారంటూ విమర్శలు చేశారు. భారతదేశంలో ఏ సీఎం ఇవ్వలేని సంక్షేమ ఫలాలు జగన్ అందించారని, మురికి వాసనతో కొట్టుకుంటున్న చంద్రబాబును ఎవరూ నమ్మరని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గల్లంతు అయి పోతారని వివరించారు. టీడీపీ ఒక స్క్రాప్ గా మారిందని, కొడాలి నాని మాటలను తప్పుగా చూపించాలని టీడీపీ తాపత్రయం పడుతుందన్నారు. సీఎం జగన్ పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లో బెల్ట్ షాపులు రద్దు చేశారని, సీపీఎస్ పై అధ్యాయనం జరుగుతుందని మంత్రి జోగి రమేష్ అన్నారు.
మేనిఫెస్టోకు అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు - తిరుమలలో మంత్రి గుడివాడ
మేనిఫెస్టోకు అర్ధం తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడని, చంద్రబాబును నమ్మే స్ధితిలో ప్రజలు లేరని ఏపి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ... గత ఏడాది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన రామయ్య పట్నం పోర్ట్ పనులపై సమీక్షించినట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి రామయ్యపట్నం పోర్ట్ మొదటి దశ పనులు పూర్తి అయ్యే విధంగా అధికారులను ఆదేశించాంమన్నారు. శ్రీసిటీలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధితో పాటు తిరుపతి విభాగంకు సంబంధించిన పారిశ్రామిక వేత్తలతో సమస్యలపై చర్చించాంమని అన్నారు. ఏపి రాష్ట్రం పారిశ్రామిక పరంగా అభివృద్ధి, పోర్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో దాదాపు పది ఫిషింగ్ హార్బర్ లను త్వరలోనే ప్రారంభించబోతున్నామని, విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, మిగిలిన పారిశ్రామిక పనులు పెద్ద ఎత్తున జరుగుతుందని తెలియజేశారు.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో పదమూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరుగుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి రాష్ట్రంలో పరిపాలన జరిగేందుకు స్వామి వారి ఆశీస్సులు కావాలని ప్రార్ధించినట్లు తెలిపారు. మేనిఫెస్టో అనే దానికి చంద్రబాబుకు పెద్దగా అర్ధం తెలియదని, చంద్రబాబు కొత్తగా పార్టి పెట్టి, కొత్త మేనిఫేస్టో పెడితే బహుశా ప్రజలు నమ్మెవారేమోనని వివరించారు. 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన వ్యక్తిగా రాష్ట్ర ప్రజలందరికి చంద్రబాబు అంటే ఏంటో తెలుసునన్నారు. ఐదు కేజీల బంగారు, పది కేజీల వెండి, ఇంటికొక్క బెంజ్ కారు ఇస్తానంటే కూడా చంద్రబాబుని ప్రజలు నమ్మరని ఆయన ఆరోపించారు. పొత్తులతో తప్ప నేను నేరుగా రాజకీయం చేయలేను, పార్టినీ నడపలేను అని పవన్ కళ్యాణే చెప్పారని గుర్తు చేశారు. దొంగల ముఠా వ్యవహారం ప్రజలకు తెలిసేలా మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. కొడాలి నానిపై సోషల్ మీడియాలో పెట్టిన వాటిపై నేను సమాధానం చెప్పనన్నారు. కొడాలి నాని కావాలని మాట్లాడిన మాటలు కాదని, విశాఖపట్నంకు ఇన్ఫోసిస్ వస్తుందంటే అది ఎవరి వల్లో లోకేష్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో గెలువలేని వ్యక్తి, ప్రజల్లో కనీసం పలుకుబడి లేని లోకేష్ వైసీపీ నాయకులను విమర్శిస్తుంటే హాస్యాస్పదంగా ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
600 హామీలు ఇచ్చి ఆరు కూడా నెరవేర్చలేరు..!
మా పాలన చూసి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకి నవ నాడులు చిట్లి పోతున్నాయని ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. బుధవారం ఉదయం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ ఏపి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై సంచళన వ్యాఖ్యలు చేశారు. వైసీపి పాలన చూసిన చంద్రబాబుకి నవ నాడులు చిట్లి పోతున్నాయని, పిచ్చికి పరాకాష్ట టీడీపీ ఛార్జ్ షీట్ అని మండిపడ్డారు. 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అని, సీఎం సంతకాలకు విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి బోండా ఉమా అని, అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా నాలుగేళ్ల జగన్ పాలన కొనసాగిందని ఆమె కొనియాడారు.15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 ఇస్తాను అంటే టీడీపీని నమ్మేవారు ఎవరూ లేరన్నారు. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబును నమ్మి ఓటేసే రైతులు ఎవ్వరూ లేరని, టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న వాటిలో మూడు వైసీపీవేనని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ నుంచి రెండు, అలాగే కర్ణాటక బీజేపీ నుంచి ఒక పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. అవినాష్ కు వ్యతిరేకంగా ఆరోపణలు తప్ప సాక్ష్యాలు లేవని నేడు హైకోర్టు చెప్పిందన్నారు. చంద్రబాబుకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని, ఇకనైనా జగన్, భారతీలపై ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు మానుకోవాలన్నారు. ఎంపీ అవినాష్ తప్పు చేసి ఉంటే నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు చర్య తీసుకోలేదన్నారు. ఉద్దేశ పూర్వకంగానే సౌమ్యుడు అయిన అవినాష్ ను టార్గెట్ చేశారని ఆర్.కే.రోజా అన్నారు.