Tirumala Rush Decreased: తిరుమలలో చిరుతపులి, ఎలుగుబంటి లాంటి వన్యమృగాల సంచారం అధికంగా ఉండటంతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో స్వల్పంగా భక్తుల రద్దీ  తగ్గింది. బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన తర్వాత నడక‌మార్గాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆంక్షలు విధించింది. భక్తుల రక్షణార్థం కాలినడకన వచ్చే వారికి చేతి కర్ర అందిస్తోంది టీటీడీ. ఈ క్రమంలో తిరుమలకు వెళ్ళేందుకు భక్తులు ఆశక్తి చూపడం లేదు. టిటిడి అటవీ శాఖ అధికారులు భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ శ్రీవారి భక్తుల్లో మాత్రం భయం తగ్గడం‌ లేదు. బాలికపై చిరుత దాడిని భక్తులు ఏమాత్రం మరిచి పోలేక పోతున్నారు.


మూడు మార్గాల్లో తిరుమలకు భక్తులు..
శ్రీ వేంకటేశ్వరుని దర్శనార్థం ప్రతినిత్యం దేశ విదేశాల నుండి భక్తులు వివిధ రూపాల్లో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. తిరుపతి నుండి తిరుమలకు వెళ్లేందుకు మొదటిది రోడ్డు మార్గం, రెండవది అలిపిరి నడక మార్గం, మూడవది శ్రీవారి మెట్టు మార్గం ఈ మూడు మార్గాల్లోనే భక్తులు అధికంగా వెళ్తుంటారు. కొందరు రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటే, మరికొందరు నడక మార్గాల్లో కుటుం సభ్యులతో కలిసి ప్రతి మెట్టుకు పసుపు,‌ కుంకుమ అద్దుతూ, కర్పూరం వెలిగిస్తూ గోవింద నామస్మరణ చేసుకుంటూ తిరుమలకు వెళ్తారు. 
రెండు నడక మార్గాల్లోనూ భక్తులు దట్టమైన అటవీ ప్రాంతంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇటీవల ఈ రెండు నడక‌మార్గాల్లోనూ వన్యమృగాల సంచారం అధికమైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 22వ తారీఖున కర్నూలు జిల్లాకు చెందిన ఓ బాలుడిపై చిరుత దాడి చేసి గాయపరచిన ఘటన మరువక ముందే, ఈ నెల 11వ తారీఖున బాలికపై చిరుత పులి దాడి చేసి చంపేసిన ఘటన టిటిడి అధికారులను, యావత్తూ శ్రీవారి భక్తులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఈ రెండు ఘటనల అనంతరం నడక‌మార్గాల్లో భక్తుల భధ్రత దృష్ట్యా టిటిడి ఆంక్షలు విధించడంతో నడక మార్గాల్లో తిరుమలకు చేరుకునే వారి సంఖ్య తగ్గింది.  
శ్రీవారి మెట్టు మార్గంలో ఈ నెల 14వ తారీఖున 7 వేల మంది రాగా, 15వ తారీఖున 5100 మంది, 16వ తారీఖున 4100మంది,17వ తారీఖున 4900 మంది వెళ్ళారు.. ఇక అలిపిరి నడక మార్గం గుండా ఈనెల 14వ తారీఖున 19 వేలమంది తిరుమలకు వెళ్లగా, 15వ తారీఖున 14వ వేలు, 16వ తారీఖున 8200 మంది, 17 వ తారీఖున 7900 మంది మాత్రమే తిరుమలకు కాలినడక మార్గమున వెళ్ళినట్టు తెలుస్తోంది.. గతంలో అలిపిరి నడక మార్గం గుండా రోజుకి ముప్పై నుండి నలభై వేల మంది వెళ్తుంటే, శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 15 వేల మంది నుండి ఇరవై వేల వరకూ వెళ్లేవారు.


వన్యమృగాలు ట్రాప్ ను ఎలా ఏర్పాటు చేశారంటే..???
అలిపిరి నడక మార్గాల్లో చిన్నారులపై చిరుత దాడి జరిగిన తర్వాత అప్రమత్తమైంది టిటిడి. వన్యమృగాల సంచారం అధికంగా ఉండే ప్రదేశాలను గుర్తించి ట్రాప్ కెమెరాల సహాయంతో వాటి జాడలను గుర్తించి అలిపిరి నడక మార్గంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు చిరుతలను బంధించి ఎస్వీ జూపార్క్ కు తరలించారు.. కానీ శ్రీశైలం నుండి నలభై మంది అటవీ శాఖ నిపుణులను తిరుమలకు తీసుకొచ్చిన టిటిడి వారి సలహాలు, సూచనలతో మరికొన్ని ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాల్లో ట్రాప్ లను ఏర్పాటు చేశారు.. 
అలిపిరి నడక మార్గంలో 3 ట్యాపులను ఏర్పాటు చేయగా, శ్రీవారి మెట్టు మార్గంలో 100 డ్రాపులను ఏర్పాటు చేశారు. నడక మార్గంకు సమీపంగా వన్యమృగాలు జాడలను ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయా ప్రదేశాల్లో ట్రాప్లను ఏర్పాటు చేస్తున్నారు. వన్యమృగాలు నడక మార్గాల్లో ఘాట్ రోడ్లలో ఎందుకు సంచరిస్తున్నాయి అనే దానిపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. వన్యమృగాలను బంధించేందుకు మధ్యప్రదేశ్ నుంచి ఆత్యాధునికంగా తయారు చేసిన దాదాపు ఆరు ట్రాప్ బోన్ లను, నాలుగు వలలను టిటిడి తిరుమలకు తెప్పించింది. వీటిని మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, భక్తుల భధ్రత దృష్ట్యా మరింత ప్రతిష్ట చర్యలను తీసుకుంటుంది.