TTD News: అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్నమ‌య్య భ‌వ‌నంలో శుక్రవారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. గత నెల సెప్టెంబర్‌ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఈ నెల 14న అంకురార్పణ జరుగుతందన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19న గరుడసేవ, అక్టోబరు 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం నిర్వహిస్తారు. ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుందన్నారు.


గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుందని, భ‌క్తులంద‌రికీ ద‌ర్శనం క‌ల్పించేలా రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు ఉంటుందని ఈఓ పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవని, బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసినట్లు చెప్పారు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్‌ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు.


 భక్తుల భద్రత దృష్ట్యా అక్టోబరు 19న గరుడసేవ నాడు ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 19న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17 నుంచి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదని. బ్రహ్మోత్సవాల మిగతా రోజుల్లో యధావిధిగా ఉంటుందని ధర్మారెడ్డి వెల్లడించారు. పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా అధిక రద్దీ దృష్ట్యా, ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని రద్దు చేశామని. తిరుపతిలో అక్టోబర్‌ 6, 7, 8, 13, 14, 15వ తేదీలలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయబడవన్నారు. అక్టోబర్‌ 29వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్‌ 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. 


ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి వేస్తారని ఈఓ అన్నారు. అక్టోబర్‌ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని అక్టోబరు 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి అక్టోబరు 29న ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ఈ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ ఉండదని భక్తులు గుర్తించాలని కోరారు. అక్టోబర్‌ 28న సహస్రదీపాలంకారసేవను, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. 


అటవీశాఖ అధికారులు అలిపిరి కాలినడక ప్రాంతంలో ఇప్పటి వరకు ఆరు చిరుతలను బంధించినట్లు ఈఓ వెల్లడించారు. ట్రాప్ కెమెరాల 15 రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించారని, దీంతో సెప్టెంబరు 29వ తేదీ నుంచి ఘాట్‌ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతిస్తున్నామని ఈఓ పేర్కోన్నారు. 12 ఏళ్లలోపు చిన్నపిల్లల‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కే అనుమతిస్తున్నామని, వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులు అలిపిరి కాలిన‌డ‌క మార్గాన్ని రెండు రోజుల‌పాటు ప‌రిశీలించి వారంలో నివేదిక ఇస్తామ‌ని తెలిపారు. వారి సూచ‌న‌ల మేర‌కు త‌గిన చ‌ర్యలు తీసుకుంటాని అన్నారు. 


పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ పీడియాట్రిక్‌ కార్డియాక్‌ సెంటర్‌గా గుర్తించి ఆసియా టుడే రీసెర్చ్‌ అండ్‌ మీడియా సంస్థ ‘ప్రైడ్‌ ఆఫ్‌ నేషన్‌’ అవార్డును ప్రకటించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందలు తెలిపారు. డాక్టర్లు 23 నెలల వ్యవధిలో 1,910 గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారని, ఆరు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని అన్నారు.


సెప్టెంబరు నెలలో శ్రీవారిని 21.01 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, రూ.111.65 కోట్లు  హుండీ కానుకలు, ఆదాయం రాగా, లడ్డూలు విక్రయాల ద్వారా 1.11 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 53.84 లక్షలు కాగా, కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.94 లక్షలుగా తెలిపారు.