Tirumala Laddu History: కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం. భక్తులు తప్పక తమ వారి కోసం తీసుకు వెళ్ళేది లడ్డూలు. ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు కూడా అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామి వారి ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి సరిగ్గా నేటికి 308 ఏళ్లు పూర్తి అయ్యింది. మొదట 1715 ఆగస్టు 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు.


తిరుమల వెంకన్న కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని, తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామి వారి దర్శన అనంతరం, స్వామి వారి ప్రసాదమైన లడ్డూనూ తమతో పాటూ ఇంటికి తీసుకెళ్తారు. ఈ లడ్డూను తమ ఇంటిలో భక్తి శ్రద్దలతో పూజించి ఆత్మీయులకు పంచి పెడుతుంటారు. ఇంతకి శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎప్పుడూ తయారు అయ్యింది. శ్రీవారి‌ లడ్డూ ప్రసాదం మొదలు పెట్టి ఎన్నేళ్ళు అయ్యింది. తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది. సుప్రభాత సమయంలో స్వామి వారికి వెన్నతో మొదలు పెట్టి, లడ్డూ, వడ, పోంగలి, దద్దోజనం, పులిహోరా, వడపప్పు, ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు.


తిరుమల అనగానే మనకు లడ్డూ మాత్రమే గుర్తుకు వస్తుంది. టీటీడీలో రకరకాలైన ప్రసాదాలు అందుబాటులో ఉన్నప్పటికి, భక్తులకు లడ్డూ ప్రసాదం అంటేనే ఎంతో‌ ప్రీతిపాత్రంగా ఉంటుంది. ప్రసాదాలలో శ్రీవారి లడ్డూ అగ్రస్థానంలో నిలిచింది.  ప్రసాదంగా లడ్డూను ఇవ్వడం 1715 ఆగస్టు 2 వ తేదీన ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మాత్రం చెప్పలేక పోతున్నారు. 2010 వరకూ దాదాపు రోజుకు లక్షల లడ్డూలను టీటీడీ తయారు చేసేది.‌. భక్తుల అధిక రద్దీ కారణంగా ప్రతి నిత్యం దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. ఇక లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. 2014లో లడ్డూకు భౌగోళిక గుర్తింపు (Geographical indication)  గుర్తింపు లభించింది.


ఎన్నో మార్పుల తర్వాత లడ్డూ !
శ్రీవారి భక్తులు ఎంతో ప్రీతి పాత్రంగా భావించే లడ్డూ ప్రసాదం దాదాపు 308 ఏళ్ల కిందట మొదలైందని తెలుస్తోంది. 1715 ఆగస్టు 2న శ్రీవారి లడ్డూ ప్రసాదం‌ తయారు చేసినట్లు చెబుతుంటే.. క్రీ.శ.1803లో బూందీగా పరిచయమైన అటుతరువాత 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్ధిర పడినట్లు కొందరు పండితులు భావిస్తారు. మొదట్లో లడ్డూ ప్రసాదంను ఎనిమిది నాణేలకే ఇచ్చేవారని, అటుతరువాత 2, 5, 10, 15, 25 నుంచి ప్రస్తుతం 50 రూపాయలకు టిటిడి విక్రయిస్తోంది. 1940 వ సంవత్సరాన్ని‌ ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 83 సంవత్సరాలు అవుతుందని కొందరు చెబుతారు. లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు.


పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు చరిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.. విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత ఎక్కువ పెంచినట్టు ఆధారాలున్నాయి.