Tirumala Devotees: తిరుపతి : తిరుమల దళారులు నయా ఆలోచనలతో రెచ్చి పోతున్నారు. అమాయకులైన భక్తులను టార్గెట్ గా చేసుకుని నిలువునా దోచేస్తున్నారు. శేషాద్రి నిలయుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. దేశ నలుమూలల నుండి భక్తులు స్వామి వారి దర్శనం కోసం వివిధ రూపాల్లో తిరుమలకు చేరుకుంటారు. ఇలా స్వామి సన్నిధికి చేరుకున్న భక్తులు క్షణకాలం పాటు జరిగే శ్రీవారి దర్శనం కోసం పరితపించి పోతుంటారు. స్వామి వారిపై ఉన్న భక్తి భావంతో వేల కిలోమీటర్లు సైతం లెక్క చేయకుండా నడుచుకుంటూ గోవింద నామస్మరణలతో స్వామి వారిని చేరుకుంటారు. ఎంత ఖర్చు అయ్యినా సరే, స్వామి వారిని దర్శించుకోవాలని భావించే భక్తులను దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే కొండపై ఓ దళారి మోసం వెలుగు చూసింది.
శ్రీవారి దర్శనానికి డిమాండ్
శ్రీవారి సన్నిధికి ఎలా రావాలనేది పక్కాప్లాన్ చేసుకుని మరి బస్సు, ట్రైన్, విమానాలు, సొంత వాహనాలు, అద్దే వాహనాల్లో తిరుమల పుణ్యక్షేత్రంకు వస్తుంటారు. ఒక్కసారి స్వామి దర్శనం భాగ్యం కలిగితే చాలు తమ కోర్కెలన్ని తీరి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అప్పుడు, ఇప్పుడు అని తేడా లేకుండా ప్రతి నిత్యం వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణలతో ఏడు కొండలు మారు మ్రోగుతూ ఉంటుంది. స్వామి వారి దర్శనం పొందేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడరు. స్వామి వారికి ఉన్న డిమాండ్ నే కొందరు క్యాష్ చేసుకుని కొందరు అమాయకులను నమ్మించి నిలువుగా దొపిడి చేస్తున్నారు. వైసీపి అధికారంలోకి వచ్చిన తరువాత టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత కొండపై దళారుల ఏరివేతకు టీటీడీ చర్యలు తీసుకుంది. భక్తులను మోసగించే దళారులపై కేసు నమోదు చేసి కఠన చర్యలు తీసుకున్నారు. దీంతో కొద్ది రోజులపాటు సైలెంట్ అయిన దళారులు కొత్త కొత్త ఆలోచనలతో భక్తులను మోసగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా భక్తులను మోసగిస్తున్న ఓ దళారిని టిటిడి విజిలెన్స్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కేటుగాళ్ల కొత్త రూట్ ఇదే..
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులైన భక్తులకు మాయ మాటలు చెప్పి అంది వరకూ డబ్బు గుంజేస్తున్నారు దళారులు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను టిటిడి అనుమతిస్తూ వస్తుంది. అయితే కోవిడ్ సమయంలో స్వామి వారి దర్శనం మంచి డిమాండ్ ఉండేది. ఆ సమయంలో నయా ఆలోచనలతో దళారులు నకిలీ వెబ్ సైట్ ల ద్వారా నకిలీ దర్శన టోకెన్లు సృష్టించి వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయించి మోసగించిన విషయం అనేకం వెలుగుచూశాయి. దీంతో భక్తుల వద్ద నుండి భారీగా టిటిడి విజిలెన్స్, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రావడంతో నకిలీ వెబ్ సైట్ల ద్వారా మోసం చేసే వారిపై టిటిడి దృష్డి సారించింది. టీటీడీలో అర్చకులుగా సేవలు అందిస్తున్న వారి పేరిట ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ ఖాతాలు సృష్టించి భక్తులను మోసగిస్తున్నారు.
ఆన్‌లైన్ లావాదేవిలతో జోరు
గత కొంతకాలం నుంచి పలు విధాలుగా భక్తులను మోసం చేస్తున్న దళారి కొంపెళ్ల హరి నాగసాయి కార్తీక్ అలియాస్ హెచ్.ఎన్.ఎస్.కార్తీక్ కొత్త మార్గంలో సామాజిక మాధ్యమాల వేదికగా మోసాలు చేసుకుని టిటిడి ఉద్యోగులుగా, తిరుమలలో అర్చకులుగా పని చేస్తున్నట్లు ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించాడు. కొంపెళ్ల హరి నాగసాయి కార్తీక్ అనే దళారి సత్యనారాయణ అవధాని అంబటిపూడి, గొల్లపల్లి శ్రీనివాస దీక్షితులు అనే పేర్లతో ఫేస్ బుక్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి, వీటి ద్వారా శ్రీవారి అభిషేకం, సుప్రభాతం, తోమాల, అర్చన, విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తామని భక్తుల వద్ద నుంచి కొన్ని ఫోన్ నంబర్లతో గూగుల్ పే, ఫోన్ పే యాప్‌ల ద్వారా లక్షలాది రూపాయలు తీసుకొని భక్తులను మోసం చేసినట్లు టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
భక్తుల ఫిర్యాదు మేరకు దళారిపై కేసు నమోదు చేసిన టిటిడి విజిలెన్స్ అధికారులు చాకచక్యంగా దళారిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుడిని తిరుమల పోలీసులకు అప్పగించగా.. పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. హెచ్ఎన్ఎస్.కార్తీక్ చాలా కేసుల్లో నిందితునిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై త్వరలో సస్పెక్ట్ షీట్ పెడుతున్నట్లు పోలీసులు అంటున్నారు. ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని, టిటిడి అధికారిక వెబ్‌సైట్ ద్వారా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి విజిలెన్స్ అధికారులు, పోలీసులు అధికారులు భక్తులను విజ్ఞప్తి చేస్తున్నారు.