Tirumala Darshan Tickets Online Booking News | తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. అక్టోబరు నెల ఆర్జిత సేవా టికెట్ల కోటాను జూలై 18న (గురువారం) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) టీటీడీ ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనుంది.
జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఆర్జిత సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ఛాన్స్ ఉంది. ఆర్జిత సేవా టికెట్లు లభించిన వారు జూలై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లిస్తే.. వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు చేయనుంది టీటీడీ. జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలతో పాటు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
జూలై 22న వర్చువల్ సేవల కోటా
శ్రీవారి సేవలకు సంబంధించి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల అక్టోబరు నెల కోటాను జూలై 22న (సోమవారం నాడు) మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
జూలై 23న అంగ ప్రదక్షిణం టోకెన్లు
జూలై 23న ఉదయం 10 గంటలకు అక్టోబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా
జూలై 23వ తేదీ (మంగళవారం) ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల శ్రీవారి దర్శన కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి సైతం శ్రీవారి దర్శన కోటా టికెట్లు టీటీడీ అందించనుంది. ఈ కేటగిరీల వారు శ్రీవారిని దర్శించుకునేందుకు జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
జూలై 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల
తిరుమల, తిరుపతిలలో అక్టోబరు నెలకు సంబంధించి గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతి శ్రీవారి సేవ కోటా జూలై 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 కి విడుదల చేయనున్నారు.
Also Read: శ్రీ కృష్ణుడిని ఇటుకపై నిలబెట్టిన భక్తుడు..ఈ క్షేత్రంలో తొలి ఏకాదశిరోజు జరిగే ఉత్సవం చాలా ప్రత్యేకం!
సుప్రభాత సేవ మినహా అన్ని ఆర్జిత సేవలు రద్దు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. వార్షిక బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అదే విధంగా అక్టోబర్ 11, 12న శ్రీవారి సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 3 నుంచి 13 వరకు అంగ ప్రదక్షిణతో పాటు శ్రీవారి వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లోనే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.