బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి ఉభయ దేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై తిరుమల వీధుల్లో వివరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చాడు. శ్రీవారి వాహన సేవకు ముందు వివిధ కళారూపక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వాహన సేవను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో... వీధులన్నీ భక్త జనసాంద్రంగా మారాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా భక్తులకు అభయమించారు.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో కారైకాల్ కు చెందిన ' నాట్యాలయ భరతనాట్యం' బృందం కలైమామణి గురు డా. చిత్రాగోపీనాథ్ 15మందితో కూడిన తమ బృందంతో ప్రదర్శించిన "భరతనాట్య" ప్రదర్శన వీక్షకులను అలరించింది. ఈ నాట్య ప్రదర్శనలో - పురందరదాస కీర్తనలైన 'శరణు సిద్ధివినాయక, జగన్మోహననె కృష్ణ, జయజయవిఠల పాండురంగ, వేంకటరమణెనె బారో, 'బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం..' పాటలకు నర్తకీమణులు శ్రీనిధి, నిత్యశ్రీ, రియాశ్రీ, అనురాగ, దర్శనీ, జననీ, శ్రీలేఖ ప్రదర్శించిన హావభావాలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం గోపీనాథ్ అందించారు. ఈ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు బృందం సమర్పించారు.
తిరుమలలోని ఆస్థాన మండపంలో ఉదయం వేద సందేశం, వాణిశ్రీ బృందం విష్ణుసహస్రనామపారాయణం, విశాఖకు చెందిన శ్రీ చైతన్య బ్రదర్స్ భక్తి సంగీతం, డా. రాజగోపాలన్ భక్తామృతం ధార్మికోపన్యాసం, సాయంత్రం శ్రీ ఎస్వీ ఆనందభట్టర్ బృందం అన్నమయ్య విన్నపాలు, శ్రీ వై.వెంకటేశ్వర్లు హరికథా పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
అన్నమాచార్య కళామందిరంలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు చిన్నమ్మదేవి, డా. ఉషారాణి బృందం భక్తి సంగీతం భక్తులను మైమరపింప చేసారు. రామచంద్ర పుష్కరిణి వేదికపై మొదట ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు ఎ. చెన్నయ్య అన్నమాచార్య కీర్తనలను తమ వేణుగానంతో సమ్మోహితులను గావించారు. అనంతరం భరతనాట్య అధ్యాపకులు ఎన్. శివప్రసాద్ మార్గదర్శనలో తమశిష్యులచే అన్నమాచార్యుల కీర్తనలైన తందానాన ఆహి, అదివో అల్లదివో ఇత్యాదుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
గరుడ సేవనాడు సర్కారు హారతి మాత్రమే....
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 22న శుక్రవారం రాత్రి జరగనున్న గరుడ సేవ నాడు సర్కారు హారతి మాత్రమే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఇతర హారతులు అనుమతించబడవని తెలియజేశారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాలని కోరారు. బ్రహ్మోత్సవాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారిని వీధుల్లో ఊరేగిస్తుండగా భారీగా భక్తుల తరలివచ్చి ఆయనను దర్శించుకున్నారు,