TTD News: ఇల వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో భక్తులను కరుణించారు. శుక్రవారం శ్రీవారికి అంత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై విహరించనున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.
గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి 2 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు కదిలేలా ప్రణాళిక రూపొందించారు. గరుడసేవ దర్శనం కోసం బయట వేచి ఉండే భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలని టీటీడీ కోరింది.
టీటీడీ ఏర్పాట్లు
- మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుంచి రాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించనున్నారు. గ్యాలరీల్లోనూ ఉదయం నుంచి రాత్రి వరకు పులిహోర, టమాటా బాత్, బిసిబెళాబాత్ అన్నప్రసాదాల ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. భక్తుల కోసం 2.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు.
- ఆలయ నాలుగు మాడవీధుల్లో పరిశుభ్రత, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం బ్రహ్మోత్సవాల రోజుల్లో అదనంగా 247 మంది, గరుడసేవ నాడు అదనంగా మరో 774 మందిని ఏర్పాటు చేశారు. భక్తుల కోసం నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 524 తాగునీటి డ్రమ్ములను ఏర్పాటుచేసి శ్రీవారి సేవకుల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
- బ్రహ్మోత్సవాలకు దాదాపు 1130 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందితోపాటు 3,600 మంది పోలీసులతో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడసేవకు ప్రత్యేకంగా 1,200 మంది పోలీసులతో అదనపు భద్రత కల్పించారు. ఆలయ మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,770 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు.
- ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం సాయంత్రం 6 గంటల నుంచి సెప్టెంబరు 23వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాలను పార్క్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.
- ఆర్టీసీ బస్సుల్లో 3 వేల ట్రిప్పుల ద్వారా దాదాపు 3 లక్షల మందిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. భక్తులకు వైద్యసేవల కోసం మాడవీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్‌లు, 7 అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని టీటీడీ ఏర్పాటు చేసింది.
- గరుడసేవ రోజు వాహనసేవను తిలకించేందుకు మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి గృహం, అన్నదానం కాంప్లెక్స్, రాంభగీచా విశ్రాంతి గృహం, ఫిల్టర్ హౌస్ ఇతర ప్రాంతాల్లో కలిపి 20 పెద్ద డిజిటల్ స్క్రీన్లను టీటీడీ అధికారులలు ఏర్పాటు చేశారు.