TTD Tickets News: తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే మూడు నెలల ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. 2026 జనవరి నెలకు సంబంధించి టీటీడీ వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలును విడుదల చేశారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
23న ఆర్జిత సేవా టికెట్ల విడుదల చేస్తారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
మరో వైపు తిరుమల శ్రీవారి లడ్డూ ధరలను పెంచే ప్రసక్తే లేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. కావాలనే కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.. లడ్డు ధరల పెంపు అంటూ నిరాధార వార్తలను ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీపై కొన్ని ఛానళ్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. టీటీడీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తప్పుడు వార్తలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.