గ్లోబల్ డ్రోన్ హబ్‌గా భారతదేశం ప్రపంచ పటంలో నిలవాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా, డ్రోన్ల తయారీలోనూ, డ్రోన్ సాంకేతికతను అందించే హబ్‌గానూ నిలిచేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులు వేసింది. అందులో భాగంగా, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో దేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద డ్రోన్ సిటీ లేదా డ్రోన్ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇది కేవలం రాయలసీమ ప్రాంతానికో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో కాదు; దేశానికే తలమానికంగా నిలవనుందని డ్రోన్ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. కర్నూలులోని ఓర్వకల్లులో ఏర్పాటు చేసే డ్రోన్ సిటీ దేశ భద్రతలోనూ కీలకం కానుందని విశ్లేషిస్తున్నారు. అయితే, అసలు ఈ డ్రోన్ సిటీ లేదా డ్రోన్ హబ్ పూర్తి విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ కథనం మీకోసమే.

Continues below advertisement

కర్నూలు డ్రోన్ హబ్‌లో అసలేం ఏం జరుగుతుందో తెలుసా?

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో 300 ఎకరాల్లో ఈ డ్రోన్ హబ్ ఏర్పాటు కానుంది. ఇక్కడ విమానశ్రయం, ఫ్లై జోన్ ఉండటం కారణంగానే ప్రభుత్వం ఓర్వకల్లులో ఈ హబ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అయితే, అందరూ అనుకున్నట్లు ఇది కేవలం డ్రోన్ తయారీ కేంద్రం కాదు. ఇది డ్రోన్‌కు సంబంధించి అన్ని విషయాలకు సమగ్ర కేంద్రంగా నిలవనుంది.

Continues below advertisement

1. అన్నీ ఒకే గొడుగు కింద (Under one umbrella)

డ్రోన్లను ఈ హబ్‌లోనే తయారు చేస్తారు. తయారు చేసిన డ్రోన్లను అన్ని విధాలా పరీక్షించే (Testing) సదుపాయాలు కల్పిస్తారు. అంతే కాకుండా, వివిధ రకాల సాంకేతికతలను కలబోసి కొత్త తరం డ్రోన్ల తయారీ కోసం పరిశోధన మరియు అభివృద్ధి (R&D) కేంద్రాలను ఈ డ్రోన్ హబ్‌లో ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు డ్రోన్ల మరమ్మతులు (MRO - Maintenance, Repair, and Overhaul) స్టేషన్స్ ఉంటాయి. ఇక డ్రోన్లకు అవసరమైన సర్టిఫికేషన్ (ధృవీకరణ) వంటి సదుపాయాలన్నీ ఇక్కడ లభిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందించడమే ఈ డ్రోన్ హబ్ ముఖ్య లక్ష్యం.

2. ప్రపంచంలో అతిపెద్ద టెస్టింగ్ ఫెసిలిటీ

ఇక కర్నూలులోని ఓర్వకల్లులో ఏర్పాటు చేసే డ్రోన్ హబ్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద కామన్ డ్రోన్ టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇది తయారయిన డ్రోన్ల నాణ్యతకు హామీకి, సరికొత్త ఆవిష్కరణలకు (Innovation) కేంద్రంగా మారుతుంది.

3. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

ఇక్కడ డ్రోన్లను తయారు చేయడమే కాదు. వీటిని ఆపరేట్ చేసే డ్రోన్ పైలట్‌లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లను తయారు చేయడానికి శిక్షణా అకాడమీలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు నెలకొల్పుతారు. దీని ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

4. భౌగోళిక ప్రయోజనం

ఓర్వకల్లు ప్రాంతం కర్నూలు విమానాశ్రయం, జాతీయ రహదారులకు అనుకూలంగా ఉండటమే కాకుండా, హైదరాబాద్-బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా అనుకూలంగా ఉంటుంది. డ్రోన్ హబ్ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోనున్నాయి.

డ్రోన్ రంగంలో పెట్టుబడుల కేంద్రంగా కర్నూలు డ్రోన్ హబ్

కర్నూలులో ఈ డ్రోన్ హబ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన డ్రోన్ పాలసీ ద్వారా సుమారు వేయి కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న ఐదేళ్లలో దాదాపు 3 వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా. అయితే, ఈ డ్రోన్ సిటీలో ఇప్పటికే డ్రోన్ రంగంలో మంచి పేరున్న సంస్థ గరుడ ఏరోస్పేస్ వంద కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. డ్రోన్ల తయారీ, మరమ్మతులకు సంబంధించిన డ్రోన్-యాజ్-ఎ-సర్వీస్ (DaaS) అందించే అనేక దేశీయ, విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. దీంతో అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తమ పెట్టుబడులను ఈ డ్రోన్ సిటీలో పెట్టేందుకు చర్చలు ప్రారంభించాయి.

పెరగనున్న ఉపాధి అవకాశాలు

డ్రోన్ హబ్ ద్వారా భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 40 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవచ్చని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా, ఇక్కడ ఏర్పాటు చేసే నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా 25 వేల మందికి డ్రోన్ పైలట్‌లుగా శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి లభిస్తుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో డ్రోన్ల తయారీ, శిక్షణ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే?

మన దేశంలో ముఖ్యంగా రక్షణ (Defense), నిఘా (Surveillance), వ్యవసాయం (Agriculture), మ్యాపింగ్ (Mapping) రంగాల కోసం డ్రోన్లను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఈ అవసరాలను తీర్చేలా ఆయా సంస్థలు దేశవ్యాప్తంగా తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. అందులో:

సంస్థ పేరు                                                     ప్రాంతం                                       ప్రధాన ఉత్పత్తులు

ఐడియాఫోర్జ్ టెక్నాలజీ (ideaForge)                 ముంబై                              నిఘా, భద్రత, మ్యాపింగ్ కోసం డ్రోన్లు

గరుడ ఏరోస్పేస్ (Garuda Aerospace)              చెన్నై                                వ్యవసాయం (కిసాన్ డ్రోన్‌లు), పారిశ్రామిక అవసరాల కోసం తక్కువ-ధర డ్రోన్లు

అస్టీరియా ఏరోస్పేస్ (Asteria Aerospace )       బెంగళూరు                        రక్షణ, భద్రత, ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమల కోసం డ్రోన్లు

జెన్ టెక్నాలజీస్ (Zen Technologies)               హైదరాబాద్                      డ్రోన్ శిక్షణ సిమ్యులేటర్లు, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలు, లైవ్-ఫైర్ UAVలు

మారుత్ డ్రోన్స్ (Marut Drones)                        హైదరాబాద్                      వ్యవసాయ డ్రోన్‌లు (AG 365 వంటివి), డ్రోన్ శిక్షణ

బీఈఎల్ (BEL - Bharat Electronics Ltd)            ప్రభుత్వ రంగ సంస్థ         రక్షణ దళాల కోసం నిఘా UAVలు వంటి అధునాతన ఎలక్ట్రానిక్ వ్యవస్థలు

డ్రోన్ తయారీ, ఆవిష్కరణలకు మద్దతు ఇచ్చే కొన్ని ప్రాంతాలు

బెంగళూరు, కర్ణాటక – ఇది ఏరోస్పేస్‌తో పాటు టెక్నాలజీ పరిశ్రమలకు సాంప్రదాయికంగా కేంద్రంగా ఉంది. ఇక్కడ అనేక డ్రోన్ స్టార్టప్‌లు, R&D సంస్థలు, డ్రోన్-యాజ్-ఎ-సర్వీస్ (DaaS) ప్రొవైడర్‌లు ఇప్పటికే పనిచేస్తున్నాయి.

హైదరాబాద్, తెలంగాణ – రక్షణ రంగం మరియు టెక్నాలజీ స్టార్టప్‌లు ఇప్పటికే ఇక్కడ ఉండటంతో, డ్రోన్ల తయారీ, కౌంటర్-డ్రోన్ వ్యవస్థలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పరిష్కారాలకు కేంద్రంగా మారుతోంది.

ఉత్తర ప్రదేశ్ డిఫెన్స్ కారిడార్ – యూపీ ప్రభుత్వం రక్షణ-భద్రతా రంగాల కోసం డ్రోన్ తయారీని ప్రోత్సహిస్తోంది. ఉదాహరణకు, IG డ్రోన్స్ వంటి సంస్థలు ఇక్కడ అధునాతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఐఐటీ ఢిల్లీ సోనిపట్ క్యాంపస్ – ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ పార్క్ (DTP) వంటి అత్యాధునిక పరీక్షా, పరిశోధనా సదుపాయాలు ఉన్నాయి. ఇది డ్రోన్ స్టార్టప్‌లు మరియు R&D సంస్థలను ప్రోత్సహిస్తోంది.

అయితే, కర్నూలులో ఏర్పాటు చేయనున్న డ్రోన్ హబ్ అనేది కేవలం తయారీ, శిక్షణ మాత్రమే కాకుండా, పరిశోధన, పరీక్షలు, తయారీ వంటి అన్ని అంశాలను ఒకేచోట కేంద్రీకరించి, పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ హబ్‌గా చెప్పవచ్చు. డ్రోన్ రంగంలో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇవ్వగలిగే హబ్‌గా నిపుణులు చెబుతున్నారు.

ఈ హబ్‌తో వచ్చే మార్పులు ఇవే

మన దేశాన్ని 2030 నాటికి ప్రపంచంలోని డ్రోన్ టెక్నాలజీ తయారీలో అగ్రగామిగా నిలపాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కర్నూలులో ఏర్పాటు చేసే డ్రోన్ సిటీ ఈ లక్ష్యం దిశగా మన దేశాన్ని నడిపే చోదక శక్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆత్మనిర్భర్ పథకం కారణంగా డ్రోన్లను స్వదేశంలో తయారు చేయడం, వాటిపై పరిశోధనలు చేయడం వంటి కార్యకలాపాలకు ఊతమిస్తోంది. దీని వల్ల డ్రోన్లను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడకుండా మన దేశం ఈ రంగంలో స్వావలంబన సాధిస్తుంది. అంతే కాకుండా, ఆయా దేశాలకు డ్రోన్లను ఎగుమతి చేసే దిశగా సాగడం ఖాయం. దీంతో పాటు, దేశీయంగా రక్షణ రంగంలోనూ, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, విపత్తుల నిర్వహణ, మ్యాపింగ్ వంటి అంశాల్లో అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని వాడే శక్తి లభిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు ఇవే

డ్రోన్ సిటీ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ఐటీ, ఏఐతో పాటు డ్రోన్ టెక్నాలజీకి కేంద్రంగా మారుతుంది. పెట్టుబడులు పెరుగుతాయి, ఎగుమతులు పెరగడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. రాష్ట్ర వ్యవసాయ రంగంలో డ్రోన్ల ద్వారా పురుగులమందు పిచికారీ, పంటల పర్యవేక్షణ సులువు అవుతుంది. కర్నూలు డ్రోన్ సిటీ ద్వారా పెద్ద ఎత్తున శిక్షణ, తయారీ యూనిట్ల కారణంగా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక ప్రైవేటు రంగంలోనే కాకుండా, ప్రభుత్వ పరంగా ఆయా శాఖల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతుంది. ఆయా ప్రాంతాల మ్యాపింగ్‌కు, శాంతిభద్రతల పర్యవేక్షణకు, విపత్తు వేళల్లో డ్రోన్ల సాయం అందుతుంది. తద్వారా ప్రభుత్వ పాలనా సామర్థ్యం మరింత మెరుగవుతుంది.

ఈ డ్రోన్ సిటీ కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఇలా డ్రోన్ల తయారీ, శిక్షణ, మరమ్మతులు, ఆర్ & డీ విభాగాలు అన్నీ కేంద్రీకృతమైన ప్రాజెక్టు ఎక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. తద్వారా మన దేశం డ్రోన్ల రంగంలో సరికొత్త అంతర్జాతీయ కేంద్రంగా 2030 నాటికి మారడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.