Who is Next TTD chairman :   తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే మంత్రి పదవి కంటే ఎక్కువ. అలాంటి పదవి కోసం ఎంత తీవ్ర ఒత్తిడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో లోక్ సభ టిక్కెట్ నిరాకరించడంతో వైవీ సుబ్బారెడ్డిని బుజ్జగించడానికి ఆధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పోస్టును ఇచ్చారు  సీఎం జగన్. తర్వాత కొనసాగించారు. వచ్చే నెల పదో తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. కొత్త టీటీడీ బోర్డును  నియమించాల్సి ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఈ సారి బీసీ వర్గాలకు ఇస్తారని ప్రచారం  


అన్ని కీలక పదవులు ఒకే సామాజికవర్గానికి ఇస్తున్నారని కొంత కాలంగా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలను తిప్పికొట్టడానికి  ఈ సారి టీటీడీ చైర్మన్ పోస్టును  బీసీ వర్గాలకు ఇస్తారన్న ప్రచారం జరుగుతోదంి. పల్నాడు జిల్లాకు చెందిన  బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణ‌మూర్తికి అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. జంగా వైసీపీ ఏర్పాటు నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన బీసీ (యాదవ వర్గం)కు చెందిన నేత. పార్టీలోని బీసీ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేసారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పేరును దాదాపుగాఖరారు చేశారని అంటున్నారు. 


తమకు చాన్సివ్వాలని ఒత్తిడి తెస్తున్న ఇద్దరు చిత్తూరు నేతలు  


అయితే తాము ఎన్నికల నుంచి  రిటైర్మెంట్ తీసుకున్నామని తమకు చాన్సివ్వాలని  సీఎం జగన్‌పై ఇద్దరు వైసపీ సీనియర్ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందుల ఒకరు చెవిరెడ్డి  భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడ్ని రంగంలోకి దించుతున్నారు. చెవిరెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. తుడా ఛైర్మన్ హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగతున్నారు. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి స్థానంలో ఆయన కుమారుడు పోటీ చేయటం దాదాపు ఖాయమైంది.   పార్టీ పని కోసం ఆయనను జగన్ ఆయనను పోటీ నుంచి విరమించుకోవాలని సూచించారు. చాలాసార్లు టీటీడీ  బోర్డు సభ్యునిగా..ఉన్నప్పటికీ చైర్మన్ గా చేయాలనేది  చెవిరెడ్డి లక్ష్యం. అందకే  సీఎం జగన్ మోహన్ రెడ్డికి తనకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. 


రేసులోకి భూమన కరుణాకర్ రెడ్డి కూడా !


టీటీడీ చైర్మన్ రేసులోకి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా వచ్చారు. సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి..  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదు. ఆయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. టీటీడీ చైర్మన్ గా చేసి రిటైర్ అవుతానని అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గతంలో భూమన ఓ సారి టీటీడీ చైర్మన్ గా చేశారు. ఈ ముగ్గురిలో సీఎం జగన్ ఎవరికి ఎంపిక చేసుకుంటారన్నది మరో వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత బోర్డు పదవి కాలం వచ్చే నెల పదో తేదీతో ముగుస్తుంది