తిరుమలలో భక్తులు భయంతో వణికిపోతున్నారు. ఏ పొదల్లో కదలికలు వచ్చినా చిరుతా అంటు కంగారు పడుతున్నారు. ఈ ఉదయం అదే జరిగింది. ఓ బాలుడు చిరుత అని చెప్పడంతో భక్తులంతా భయంతో పరుగులు తీశారు. 


రెండు రోజుల క్రితం చిన్నారిని చిరుతల బలి తీసుకోవడంతో ఒక్కసారిగా భక్తుల్లో భయాందోళనలు ఎక్కువ అయ్యాయి. ఈ ఉదయం చిరుతను బంధించి తరలించినప్పటికీ భక్తుల్లో ఆ టెన్షన్ మాత్రం పోలేదు. మొక్కలు తీర్చుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలకు మెట్ల మార్గంలో తిరుమల కొండకు చేరుకుంటున్నారు. 


కొండపైకి వెళ్తున్న భక్తులు ఆ ప్రాంతాల్లో ఏ చిన్న కదలిక చూసినా భయపడిపోతున్నారు. దీనికి తోడు పుకార్లు షికారు చేస్తున్నాయి. అలాంటి పరిస్థితే ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఓ బాలుడు తాను రెస్ట్ రూమ్‌కి వెళ్లినప్పుడు చిరుత వెళ్లడం చూశానని చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 


చిరుత అనే పేరు వినగానే భక్తులంతా ఒక్కసారిగా పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. నిజంగా చిరుత అటుగా వచ్చిందా లేకుంటే వేరే జంతువు అటుగా వెళ్లిందా అనేది మాత్రం తేలలేదు. ఇప్పుడు ఆ బాలుడు చూసింది చిరుతే కొందరు అంటుంటే.. ఆజాడలేవీ లేవని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో జింక వెళ్లిన జాడలు ఉన్నట్టు వివరిస్తున్నారు. 
 
వన్యమృగాల కంటే ఇలాంటి పుకార్లు మరింత ప్రమాదమని అధికారులు ఆందోళన చెందుతున్నారు. జంతు సంచారం ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని.. గుంపుగుంపులుగా వెళ్తున్న భక్తులకు టీటీడీ రక్షణ కల్పిస్తోందని టెన్షన్ పడొద్దని చెబుతున్నారు. 


అదిగో పులి.. ఇదిగో పులి అన్నట్లుగా అలిపిరి నడక మార్గంలో ఏ చిన్న అలికిడి జరిగినా చిరుతపులేనంటూ భక్తులు హడలిపోతున్నారు.. అయితే శ్రీ నృశింహా ఆలయానికి సమీపంలోనే నివాసం ఉంటున్న నేపాల్ కు చేందిన సెక్యూరిటీ సిబ్బంది కుటుంబ సభ్యులు పులిని చూసానంటూ చెబుతున్నారు. ఘటన స్ధలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి కాలి ముద్రలను సేకరిస్తున్నారు. బాలుడు కమల్ మాట్లాడుతూ.. తాను చూసింది పులేనంటూ కచ్చితంగా చెబుతున్నాడు. పులిని చూసిన కొందరు భక్తులు పరుగు తీసారని, ఈ క్రమంలోనే తాను పులిని చూసానంటూ బాలుడు కమల్ చూస్తున్నాడు.