తిరుమలలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలపై టీటీడీ దిద్దుబాటు చర్యలు సిద్ధమైంది. ఓ చిన్నారిని చిరుత బలి తీసుకోవడంతోపాటు తరచూ నడక మార్గంలో వన్యమృగాల సంచారంపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే కఠినమైన ఆంక్షలు విధించాలని భావిస్తోంది. భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు.  


ఘాట్ రోడ్డు, నడక మార్గంలో వన్యప్రాణులు సంచారంతో ఈ ఉదయం టిటిడి ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి హైలెవల్ కమిటి సమావేశం ఏర్పాటు చేశారు. టిటిడి ఈవో ధర్మారెడ్డి, టిటిడి అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పి పరమేశ్వరరెడ్డి, టిటిడి సివిల్‌ అండ్ ఎస్వోతోపాటుగా మరికొంత మంది అధికారులు ఈ భేటీలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ముఖ్యంగా నడకదారి భక్తుల భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తారు. 


దర్శన టోకెన్ కోసం నడకదారిన వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని టిటిడి భానిస్తుంది. నడకదారి భక్తులకు జారి చేసే దర్శన టోకెన్ల విధానాన్ని రద్దు చేసి, సర్వదర్శన టోకేన్లు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం జారీ చేస్తున్న 15 వేల టోకెన్ల సంఖ్యను 30 వేలకు పెంచే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇలా చేస్తే భక్తులు దర్శన టోకెన్ కోసం ఇలా ప్రమాదకరమైన నడకదారి ప్రయాణం తగ్గిస్తారని, మెక్కులు ఉన్న వారే నడకమార్గంలో వస్తారని భావిస్తుంది. మరికొన్ని కీలన నిర్ణయాలను సమావేశం అనంతరం వెల్లడించే అవకాశం కనిపిస్తుంది.


చిన్నారిపై దాడి చేసిన తర్వాత మనిషి రక్తాన్ని రుచి మరిగిన చిరుత చాలా సార్లు ఆ ప్రాంతాల్లో భక్తులకు కనిపించి టెన్షన్ పెట్టింది. చిరుత దాడి తర్వాత భక్తుల భద్రత దృష్ట్యా అలిపిరి నడకమాత్రం మార్గంలో టిటిడి ఆంక్షలు విధించింది. అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం అదుపులోకి వచ్చేంతవరకు ఆంక్షలు అమలు చేయాలని భావిస్తోంది. శనివారం‌ ఒక్క రోజే‌ అలిపిరి‌ నడక మార్గం, ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్టు భక్తులు చెబుతున్నారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాల్లో, గాలిగోపురం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.


ఆదివారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో రెండో ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత వాహనదారులను తారాస పడింది. వాహనదారులు సమాచారం మేరకు ఘటన స్థలం వద్దకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఆదివారం సాయంత్రం 2450వ మెట్టు వద్ద భక్తులకు చిరుత కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన భక్తులు‌ వెంటనే సమీపంలో ఉన్న సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత మళ్లీ నడక మార్గంలోకి రాకుండా భారీ శబ్దాలు చేస్తూ చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమే ప్రయత్నం చేశారు 


రెండు రోజుల క్రితమే అలిపిరి నడక మార్గంలో ఆరెళ్ళ బాలిక లక్షితపై దాడి చేసి‌ చంపేయడంతో అప్రమత్తంమైన టిటిడి 7వ మైలు నుంచి శ్రీ నృశింహ స్వామి ఆలయం వరకూ 100 మంది భక్తులను ఒకేసారి పంపుతున్నారు. తాళ్ల సహాయంతో భక్త బృందాన్ని ముందు వైపు, వెనుక వైపు మరికొందరు భద్రతా సిబ్బంది ఉంటూ సురక్షితంగా పంపుతున్నారు. 


అలిపిరి నడక మార్గంలో చిన్నారులు తప్పిపోకుండా ట్యాగ్స్ వేయడంతోపాటుగా, చంటి పిల్లల తల్లిదండ్రులకు సూచనలు చేస్తూ, ఆదివారం మధ్యాహ్నం నుంచి 15 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం 2 గ‌ంటల నుంచి అలిపిరి నడక మార్గంలో అనుమతిని రద్దు చేశారు. దీంతో భక్తుల భద్రతగా అలిపిరి నడక మార్గం ద్వారా కొండకు చేరుకోవచ్చని టిటిడి భావిస్తుంది. చిరుత సంచరిస్తున్న కారణంగా ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల‌ నుంచి ఉదయం 6 గంటల వరకూ ద్విచక్ర వాహనాలను అనుమతిని రద్దు చేసింది.