తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడిని  పోలీసులు అరెస్టు చేశారు. ఈ తెల్లవారుజామున ఇంటిలోకి చొరబడి రవి నాయుడును తీసుకెళ్లారు పోలీసులు. నిన్న హలో లోకేష్ కార్యక్రమాన్ని డ్రోన్ల ద్వారా పోలీసులు రికార్డ్ చేశారు. దీనిపై రవినాయుడు తీవ్ర విమర్శలు చేశారు. పోలీసుల వైఖరిని తప్పు పట్టారు. 


ఇంటి నుంచి రవినాయుడి  అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు అలిపిరి స్టేషన్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. అరెస్టుపై కుటుంబ సభ్యులు పార్టీ లీడర్లు మండిపడుతున్నారు. అసలు ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో చెప్పలేదని అంటున్నారు. తన భర్తకు ప్రాణ హాని ఉందని రవినాయుడి భార్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్ తీసుకురాకుండా ఎక్కడి తీసుకెళ్లారని ప్రశ్నించారు. 


పోలీసుల తీరును ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నిస్తున్న పార్టీ లీడర్లు. రవి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని అంటున్నారు. కుటుంబ సభ్యులకైనా సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రవినాయుడుపై పోలీసుల దురుసు ప్రవర్తన సరైంది కాదంటున్నారు. 


అసలు నారా లోకేష్ చుట్టూ పోలీసులు డ్రోన్లను ఎందుకు ఎగురవేశారని ప్రశ్నిస్తున్న తెలుగుదేశం లీడర్లు. రవి అరెస్టుకు నిరసనగా అలిపిరి పోలీస్టేషన్ ముందు టిడిపి నేతలు ఆందోళన చేపట్టారు. అక్రమంగా అరెస్టు చేసిన రవి నాయుడును విడుదల చేయాలని నినాదాలు చేశారు. వారిని అక్కడి నుంచి తరలించారు పోలీసులు.


ఇప్పటికే గన్నవరం ఘర్షణల కేసులో తెలుగుదేశం నేత పట్టాభితోపాటు మరో 1౦మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలోనే మరో వ్యక్తిని అరెస్టు చేయడం కలకలం రేపింది. దీనిపై తెలుగుదేశం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 


పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన హలో లోకేష్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్‌ దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ అరెస్టు చేస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ లీడర్లు. కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లతో వీడియోలు రికార్డు చేస్తున్నారని... వారిని బెదిరించి సైలెంట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వం, పోలీసులు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి వాటికి బెదిరేది లేదంటున్నారు నేతలు. ఇలాంటివి ప్రశ్నించినప్పుడే పోలీసులు అరెస్టు చేస్తున్నారని.. ఇది దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా చాలా మంది విద్యార్థులు శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థ తీరుపై ప్రశ్నలు అడిగారు. ఇలాంటి పరిస్థితిలో పాదయాత్రను ఎలా పూర్తి చేస్తారని క్వశ్చన్  చేశారు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా పాదయాత్ర మాత్రం ఆపేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్ కోసం చేస్తున్న పాదయాత్రలో తగ్గేదేలే అన్నారు.