Malla Reddy Visits Tirumala on occasion of His Birthday | తిరుమల: సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను బాగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ప్రశంసించారు.  ప్రధాని మోదీ ఏపీకి రూ.లక్షల కోట్లు కేటాయిస్తుండగా.. సీఎం చంద్రబాబు (Chandrababu) అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కొనియాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడుతుందని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నెంబర్ వన్‌గా ఉండే తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో ఆగమాగం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని తెలిపారు.

తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మల్లారెడ్డి మాట్లాడారు. ‘ప్రతి పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నాను. స్వామి వారిని కోరిన కోర్కెలు నెరవేర్చుతున్నారు. నా మీద స్వామివారి అనుగ్రహం ఉంది. యూనివర్సిటీలు కావాలని గతంలో కోరుకున్నాను. ఒకటి రెండు కాదు మూడు డీమ్డ్ యూనివర్సిటీలు నడుపుతున్నారు. హైదరాబాద్ లో ఇలా నడుపుతున్న ఏకైక వ్యక్తిని నేను. దాదాపు 50 వేల మంది విద్యార్థులు మా విద్యాసంస్థల్లో చదువుకుంటన్నారు. 

నేను కోరకున్నా దేవుడు నాకు చాలా ఇచ్చాడు..

1984 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను కోరకున్నా భగవంతుడు నన్ను ఎంపీని చేశారు. ఆపై తెలంగాణ మంత్రిగా చేశారు. ఇప్పుడు నన్ను ఎమ్మెల్యేగా స్వామివారు ఆశీర్వదించారు.  దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా, నెంబర్ వన్‌గా తీర్చిదిద్దారు. దేశంలో అన్నపూర్ణగా తెలంగాణను మార్చిన ఘనుడు కేసీఆర్. ఐటీ రంగంలో కేటీఆర్ మూడు లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ కు తెచ్చారు. ప్రపంచంలో ఉన్న మల్టీ నేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దేశంలోనే హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో నెంబర్ వన్‌గా ఉండేది. ఇప్పుడు అన్ని రంగాల్లో పతనమయ్యాం. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆగమాగం అవుతోంది.

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి..

ఒకనాడు ఆంధ్రాలో భూములు, ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ కు వచ్చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇక్కడ నుంచి పోయి ఏపీలోనే భూములు కొంటున్నారు. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను బాగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రధాని మోదీ ఏపీకి లక్షల కోట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయింది. తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉండే రాష్ట్రం ఇప్పుడు కిందకి పడిపోతుంది. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నాను’ అన్నారు.