Balakrishna Warning YSRCP Workers: టీడీపీ నాయకుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) హెచ్చరించారు. వైఎస్ఆర్  సీపీ నేతలే కక్షలు రేపుతున్నారని, వారు సంయమనం పాటించాలని అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ శుక్రవారం (మే 27) పర్యటించారు. చిలమత్తూరు మండలం కొడికండ్ల వద్ద బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన అనుచరులను నిలిపివేసిన పోలీసులు గ్రామంలోకి ఎమ్మెల్యే బాలకృష్ణను మాత్రమే అనుమతించారు. కాన్వాయ్ లోని వేరే వాహనాలను వెళ్లనివ్వలేదు. మూడు రోజుల క్రితం కొడికండ్ల జాతరలో టీడీపీ - వైసీపీ వర్గాల మధ్య తగాదా చోటు చేసుకుంది. ఈ గొడవలో టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. వీరిని పరామర్శించేందుకు బాలకృష్ణ శుక్రవారం గ్రామానికి వచ్చారు. 


గాయపడ్డ వారిని పరామర్శించిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగొద్దని, ఒకవేళ జరిగితే ఊరుకొనేది లేదని అన్నారు. తాము కూడా తిరగబడతామని అన్నారు. సామ, దాన, బేద దండోపాయాలను మేం కూడా ప్రయోగిస్తామని అన్నారు. ప్రతి దానికి సహనం ఉంటుందని, తర్వాత కోల్పోతామని అన్నారు. ఇకపై వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని, మళ్లీ ఇలాంటి ఆలోచనలు వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తగిన శాస్తి జరుగుతుందని అన్నారు. పార్టీ కార్యకర్తలే కాకుండా.. ప్రజలు కూడా వైసీపీ నేతల్ని ఎలా తరిమికొడుతున్నారో చూస్తున్నామని అన్నారు.


హిందూపురం నియోజకవర్గంలో 2 వారాల క్రితం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తల మధ్య పరస్ఫర దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు బాలాజీ, నరసింహమూర్తి అనే వ్యక్తులు గాయపడ్డారు. వారు ఇప్పుడు కోలుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఇవాళ బాలయ్య కొడికొండకు వచ్చారు. అయితే గ్రామంలో పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదని, ఎక్కువ వాహనాలను అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు తెలిపారు. బాలక్రిష్ణ వాహనంతో పాటు మరో మూడు వాహనాలకు మాత్రం అనుమతి ఇస్తామని చెప్పారు. అయితే అన్ని వాహనాలకు అనుమతి ఇవ్వాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.


మొత్తానికి బాలకృష్ణను గ్రామంలోనికి పంపారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల దాడిలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను పరామర్శించారు. టీడీపీ నేతలను పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి బాలకృష్ణ నేరుగా ఒంగోలు బయలుదేరారు. ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో పాల్గొన్నారు.