Tirumala Darshan News: తిరుమలలో లడ్డూ వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి కలిసిందని రిపోర్టులు బయటికి వచ్చాయి. ఆ కల్తీ నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెలు కలిశాయన్న విషయం సంచలనంగా మారింది. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే కమీషన్ల కోసం నెయ్యి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చారనేది ఆరోపణ.
ఈ విషయంలో టీడీపీ గత ప్రభుత్వంపై చాలా ఆరోపణలు చేస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారంలోనే కాక, గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారు తిరుమలలో తమకు నచ్చినట్లుగా దోచుకున్నారని కూడా టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజాపై టీడీపీ ఆరోపణలు చేసింది.
వీరిద్దరూ శ్రీవారి దర్శనం టికెట్లను అమ్ముకున్నారని తెలుగు దేశం సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. కళాధర్ ట్రావెల్స్ పేరుతో పెద్దిరెడ్డి, బుక్ మై దర్శన్ పేరుతో ఆర్కే రోజా పరోక్షంగా టీటీడీ దర్శనాల విషయంలో అందినకాడికి దండుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
కళాధర్ ట్రావెల్స్ స్కామ్: పెద్దిరెడ్డి బినామీ కళాధర్ ట్రావెల్స్. ప్రతిరోజూ టూరిజం డిపార్ట్‌మెంట్ కు 1000 దర్శనం టికెట్లు కేటాయిస్తే, అందులో 800 టికెట్లు కళాధర్ ట్రావెల్స్‌కే వెళ్లేవి. నడవాల్సింది 30 బస్సులు కాగా, నడిచినవి కేవలం 4 బస్సులే. ఈ స్కామ్‌లో ఒక్కో టికెట్‌ను రూ.5,550 కి అమ్ముకున్నారు.
బుక్ మై దర్శన్ స్కామ్: బుక్ మై దర్శన్ కింద 75 టికెట్లను కేటాయించేవారు. ఒక్కో టికెట్ అమ్మాల్సింది రూ.1250 అయితే, అమ్ముకొన్నది మాత్రం రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య. ఈ టికెట్ల అమ్మకం కోసం రోజా టీం 20 మంది పని చేసేవారు. అయితే, ఈ దోపిడీలో తాడేపల్లి వాటా ఎంత?’’ అని టీడీపీ సోషల్ మీడియాలో ఆ ఇద్దరు మంత్రులను టార్గెట్ చేస్తూ సంచలనంగా ఆరోపణలు చేసింది.
‘‘వైసీపీ హయాంలో జగన్ అండ దండలతో తిరుమల కొండపై శ్రీవారి దర్శనాలను వ్యాపారం చేశారు అప్పటి మంత్రులు పెద్దిరెడ్డి, రోజా. దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్మించి రోజుకి కోటి వరకూ దండుకున్నారు’’ అని సోషల్ మీడియాలో టీడీపీ పోస్టు చేసింది.