Mahashanthi Yagam in Tirumala | తిరుమల: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూకు కల్తీ నెయ్యి వాడారని తేలడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. పవిత్రమైన తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగంపై అధికార కూటమి నేతలు, ఇటు వైసీపీ నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నష్ట నివారణ చర్యలు చేపట్టింది. శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజులపాటు మహాశాంతి యాగం నిర్వహించనున్నారు.
తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై టీటీడీ పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు అత్యవసరంగా భేటీ అయ్యారు. జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడకంతో తిరుమల లడ్డూ అపవిత్రమైంది కనుక ఆగమశాస్త్ర పరంగా ఏం చేస్తే బాగుంటుందని అధికారులు సలహాదారులను కోరారు. శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి 3 రోజుల పాటు మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కీలక సమావేశంలో వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పాల్గొని చర్చించారు.
వైసీపీ హయాంలో తిరుమలలో ప్రసాదాల తయారీలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వుతో తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలు తయారు చేశారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు తగ్గట్లుగానే గుజరాత్ కు పంపించిన టీటీడీ నెయ్యి శాంపిల్స్ లో ఆవు కాకుండా ఇతర జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపినట్లు తేలింది. ఎన్‌డీడీబీ టెస్టుల్లో కల్తీ నిజమని తేలడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాము కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వుతో చేసిన లడ్డూలను తిన్నామా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో నెయ్యిలో కల్తీపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ నుంచి సైతం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, తిరుమల పవిత్రతను దెబ్బతీయడం చిన్న విషయం కాదన్న వాదన వినిపిస్తోంది.