Tirumala Laddu Controversy | తిరుమల/ చెన్నై: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన అంశం తిరుమల ప్రసాదాలలో కల్తీ నెయ్యి వినియోగించడం. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ఇప్పటికే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయంపై గుర్రుగా ఉన్నాయి. కానీ ఇలాంటి సున్నితమైన, భావోద్వేగాలతో కూడుకున్న అంశంపై తమిళనాడుకు చెందిన ఓ యూట్యూబ్ ఛానల్ చేసిన వీడియోలు వివాదాస్పదం అవుతున్నాయి. వ్యూస్ కోసం తమిళ యూట్యూబర్లు పిచ్చి చేష్టలు చేస్తున్నారంటూ భక్తులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇన్‌స్టాగ్రామ్ రీల్‌పై ఎందుకీ వివాదం..?         


బీఫ్ కావాలా... అయితే తిరుమల లడ్డూ తిందాం అంటూ పోస్ట్ చేసిన తమిళ యూట్యూబర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాయి. తమిళనాడుకు చెందిన తమిళ్ ఫాంటసీ యూనివర్సీ అనే ఇన్‌స్టా అకౌంట్ లో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ తిరుమల లడ్డూను అవమానించే రీతిలో పోస్ట్ చేసిన రీల్స్ వివాదానికి దారితీస్తున్నాయి. అసలే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి అవి అపవిత్రం అయ్యాయని, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వివాదం నడుస్తోంది. తిరుమల శ్రీవారి అంశంపై రాజకీయాలు జరగడం, మరోవైపు ఆలయం పవిత్రత దెబ్బతీసేలా కొన్ని జరిగాయని ల్యాబ్ రిపోర్టు ద్వారా తేలిపోయింది. తిరుమల లడ్డూలను తయారు చేసిన నెయ్యిలో పందికొవ్వు, గొడ్డు మాంసం కలిసిందని రిపోర్టులు తేల్చగా.. తమిళ యూట్యూబర్ మరింత అవహేళన చేస్తూ రీల్ పోస్ట్ చేశారు. దాని ప్రకారం.. బీఫ్ తిందామా అని ఓ యువతి అడిగితే ఆమె ఫ్రెండ్ ఆమెను తిరుపతికి తీసుకెళ్లి శీవారి ప్రసాదమైన లడ్డూ ఇప్పించినట్లు ఓ రీల్ ను క్రియేట్ చేశారు తమిళ్ ఫాంటసీ యూనివర్సీ ఇన్‌స్టా పేజ్ నిర్వాహకులు.



ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మరో వీడియో కూడా పోస్ట్ చేశారు. వెనక బాంబు పేలుతుంటే నట్టులో పెట్టావని అనుకున్నావా దాస్ లడ్డూలో పెట్టాను అని ఓ వ్యక్తి చెబుతున్నట్లుగా 3 నామాలు పెట్టి మరో వివాదాస్పద రీల్ ను పోస్ట్ చేయగా రీల్స్ వైరల్ గా మారాయి. తెలివి, బుద్ధి ఉందా, అసలే తిరుమల లడ్డూపై పెద్ద వివాదం నడుస్తుంటే.. దీనిపై వ్యూస్ పిచ్చితో దారుణమైన రీల్స్ చేయడం ఏంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని భక్తులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 


ప్రాంక్ వీడియో తీసి అడ్డంగా బుక్కైన తమిళ యూట్యూబర్
తమిళనాడు యువత ఇటీవల తిరుమలలో ప్రాంక్ వీడియో చేసి జైలు పాలైన ఘటన మరవకముందే మరో తమిళ యూట్యూబర్ పిచ్చి చేష్టలతో వివాదంలో చిక్కుకున్నారు. లడ్డూ వివాదం జరుగుతున్న సమయంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా రీల్స్ క్రియేట్ చేయటం క్షమించరాని నేరమని.. వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. ఇటీవల తిరుమల క్యూలైన్లలో భక్తులపై ఫ్రాంక్ వీడియోలు తీసిన తమిళ యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ (TTF Vasan) అనంతరం తన తప్పిదంపై శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పడం తెలిసిందే. 


Also Read: Tirumala News: తిరుమలలో భక్తులపై ఫ్రాంక్ వీడియోలు - క్షమాపణలు చెప్పిన యూట్యూబర్