ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై సెటైరికల్ గా నిరసన చేపడుతున్నారు టీడీపీ నాయకులు. అధ్వాన్నంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటోందని విమర్శిస్తూ.. ఆ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా గుంతలమయంగా ఉన్న రోడ్లు, సర్వీస్ రోడ్లు చిన్న చిన్న చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల టీడీపీ నాయకులు మట్టి పోసి, రోడ్లలో గుంతలు పూడ్చివేస్తున్నారు. అయితే తాజాగా కుప్పంలో వినూత్న రీతిలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థిని ఏండగడుతూ.. విచిత్రమైన రీతిలో నిరసనకు దిగారు. నిండు కుండలా మారిన రోడ్లపై వరి మొక్కలతో నాటు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. 


ఓవైపు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కార్యక్రమం సాగుతోంది. అయితే కుప్పంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని, దీనిపై శ్రద్ద చూపని ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తోందని టీడీపీ వినూత్న రీతిలో రోడ్డుపై వరినాట్లు నాటుతూ నిరసన తెలిపారు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమం అయ్యాయి. కుప్పం - కృష్ణగిరి రహదారిలో రోడ్లు జలమయం కావడంతో ప్రజల రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుప్పంలో పల్లె బాట కార్యక్రమం చేస్తూ..  కుప్పం అభివృద్ధి వైసీపీ తోనే సాధ్యం అంటూ మాటలు చెప్తున్నారు తప్ప.. ఈ 4 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కుప్పం ప్రజలు  ఎమ్మెల్సీ భరత్ ను ఆశ్రయించాలని పెద్దిరెడ్డి పదే పదే అంటున్నారని, కలిసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్తున్నారు.


కుప్పంలో చంద్రబాబు నాయుడు వేసిన రోడ్డు పై వైసీపీ నాయకులూ తిరుగుతున్నారని అన్నారు. రోడ్డు పై ఉన్న గుంతలు కూడా పూడ్చలేని స్థితిలో మంత్రి గారు ఉన్నారని అన్నారు. కుప్పం అభివృద్ధి గురించి విమర్శలు చేయడం కాదని, అభివృద్ధి చేసి మాట్లాడాలని సూచిస్తున్నారు. కుప్పం ప్రజల వద్ద అభివృద్ధి పేరుతో వైసీపీ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు.