అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ ఏర్పాటు చేసిన మినీమహానాడుకు భారీ స్పందన వచ్చింది. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఈ సభలో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు... తాము కన్నెర్ర చేస్తే వైసీపీ లీడర్లు ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటకు రాలేరని హెచ్చరించారు. తమ లీడర్లపై సామాన్య ప్రజలపై కక్షసాధింపు మానుకోవాలని హెచ్చరించారు.
నవరత్నాల పేరుతో మోసం చేస్తూ నిలువుదోపిడీకి దిగుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్షా 75 వేల కోట్ల అవినీతి పాల్పడ్డారని ఆరోపించారు. అభివృద్ధిని గాలికి వదిలేసి... దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా మేల్కొని ఈ దగా పాలనకు సాగనంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
బుధవారం నుంచి రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు టూర్ స్టార్ట్ చేశారు. ముందుగా మదనపల్లి నుంచి టీడీపీ అధినేత పర్యటన ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల్లో "ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా" పేరుతో మినీ మహానాడు నిర్వహించనున్నారు. ముందుగా మదనపల్లిలో నిర్వహించి సభకు భారీగా టీడీపీ శ్రేణులు తరలి వచ్చారు. సభకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాటం చేస్తున్నామని ఎక్కడా రాజీపడలేదన్నారు. అయినా ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. సమస్యలు చూసి తట్టుకోలేక ప్రశ్నించిన వారిని వేధస్తున్నారన్నారు.
పోలీసులను అడ్డం పెట్టుకుని చేస్తున్న అరాచకాలు ఎన్నాళ్లో సాగవని... తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి చేసి ఉంటే అసలు జగన్ పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. అప్పుడు ముద్దులు పెట్టిన జగన్... ఇప్పుడు గుద్దులతో ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఎన్నికల ముందు అన్నీ ఫ్రీ అని చెప్పిన జగన్... ఇప్పుడు అన్ని పథకాలకు కోతలు పెడుతున్నారని ఆరోపించారు.
ప్రజాసంక్షేమ పథకాలకు కోతలు పెట్టడమే కాకుండా ఇష్టారాజ్యంగా పన్నుల పేరుతో, ఛార్జీల పేరుతో ప్రజలపై తీవ్రమైన భారం మోపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెరిగిన ధరల వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు చంద్రబాబు. మద్యనిషేధమని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన జగన్... ఇప్పుడు నాసిరకం బ్రాండ్లతో ప్రజలప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు.
అన్ని రకాల పన్నులతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్‌తగా వృత్తి పన్ను పేరుతో మరో దోపిడీకి తెర తీసిందన్నారు చంద్రబాబు. ఏటా ఇవ్వాల్సిన ఉద్యాగాలు ఏమయ్యాయని ప్రశ్నించిన చంద్రబాబు.. అసలు జాబ్ క్యాలెండర్ సంగతేంటని నిలదీశారు. ఇలాంటి అరాచక పాలనపై పోరాడాలంటే ప్రజలు ఏకం కావాలని.. తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఈ సభకు అన్నమయ్య జిల్లాలోని పార్టీ లీడర్లంతా వచ్చారు.