భారతదేశపు సుప్రసిద్ధ ఆటోమోటివ్ బ్యాటరీస్ బ్రాండ్ అమరాన్ మస్కట్‌ను విడుదల చేసింది. రాన్ పేరుతో ఇటీవలే ఈ మస్కట్ రివీల్ చేసింది. ఇక్కడ ఒక్కటే రాన్ లేదని.. చాలా ఉన్నాయని తెలిపింది సంస్థ. అందులో ప్రతి ఒక్కటీ విద్యుత్‌కు తమ శక్తివంతమైన, ఆధునిక, స్ధిరమైన రూపంలో ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పింది. సరికొత్త అమరాన్ బ్యాటరీలతోపాటే ఈ మస్కట్ విడుదల చేశారు.
ఆటోమోటివ్ బ్యాటరీల పరిశ్రమకు ట్రయల్ బ్లేజర్‌గా ఈ రాన్స్ ఉంటాయి. ఇప్పటి వరకూ ఆటోమోటివ్ బ్యాటరీలకు బ్రాండ్ మస్కట్స్ వినియోగించడం లేదు. అమరాన్ గ్రీన్ బ్రాండ్ కలర్ స్కీమ్‌లో ఫ్యూచరిస్టిక్ ఫిగర్ రాన్‌ను సృష్టించారు. ఈ రాన్ ఛాతీపై ప్రకాశిస్తోన్న 'ఏ' అనే అక్షరం ఉంటుంది. ఇది పూర్తి సరికొత్త అమరాన్ హృదయంలో దాగిన అద్భుతమైన శక్తికి ప్రతిరూపంగా నిలుస్తుందని సంస్థ అభిప్రాయపడింది. ముఖాలకు డిజిటల్ స్ర్కీన్స్‌తో, ఎమోటికాన్, జిఫ్‌లు మరెన్నో ప్రదర్శించే సామర్ధ్యం కలిగి ఉంటాయని వెల్లడించారు. రాన్స్ చుట్టూ శక్తి వలయాలు ఉంటాయని... ఇవి నూతన అమరాన్ బ్యాటరీల లోపల దాగిన అసాధారణ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు.
అమరాన్ బ్రాండ్ తమ మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి ఈ మస్కట్ ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది. ఈ మస్కట్ ఓ ఆదర్శవంతమైన చర్యలా కనిపిస్తోందని అభిప్రాయపడింది. వినియోగదారులతో పరిశ్రమ బంధాన్ని మరింత బలపడేలా చేస్తుందని... ప్రజలతో భావోద్వేగ బంధాన్ని మస్కట్‌లు సృష్టిస్తాయని తెలిపింది సంస్థ. కాలక్రమంలో బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం వల్ల వారి జ్ఞాపకాలలో చెరగని ముద్రనూ వేస్తాయంటోంది.
రాన్ ఆవిష్కరణ సందర్భంగా అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ.. బ్రాండ్ మస్కట్ విడుదల చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం... కానీ, సరైన అవకాశం కోసం ఎదురు చూశాం. బ్రాండ్‌అంబాసిడర్లు, సెలబ్రిటీలు అత్యంత విలువైన వారే కానీ... వాళ్లు ఎక్కువ కాలం బ్రాండ్‌తో ఉండలేరు. మస్కట్ మాత్రం కాలాతీతమైనది. ప్రత్యేకమైనది.. రాన్స్ ను పరిచయం చేయడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నాం. ఎందుకంటే, అమరాన్ కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్‌లకూ విస్తరించాలనుకుంటుంది. మేము పూర్తి సరికొత్త అమరాన్ బ్యాటరీలను విడుదల చేస్తోన్న వేళ, మా రాన్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువస్తాయని ఆశిస్తున్నాం అని అభిప్రాయపడ్డారు.
ఈ మస్కట్‌ను ఒగ్లీవీ ఇండియా సృష్టించింది. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్ సుజోయ్ రాయ్ మాట్లాడుతూ...ఓ సంవత్సర కాలంగా రాన్స్ కోసం పని చేస్తున్నాం. అత్యంత అనుకూలమైన మస్కట్ తీర్చిదిద్దాలనుకున్నాం. అలాగని సాధారణ సెరల్ మస్కట్స్ లేదంటే అతి సాధారణమైన మానవ లేదా జంతు ముఖాకృతులతో వెళ్లకూడదని అనుకున్నాం. బ్రాండ్ పరిణామానికి చెప్పేలా మస్కట్ ఉండాలని అమరాన్ కోరుకుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాన్స్ ఆకర్షణీయంగా ఉంటూ 21వ శతాబ్దానికి సరిపోవడమే కాదు, శక్తి కలిగి ఉంది. కలకాలం నిలిచి ఉంటూ అమరాన్ మాటకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు.