రాజ‌కీయ ల‌బ్ది కోసం గ‌త ప్ర‌భుత్వం డేటా చౌర్యానికి పాల్ప‌డిన‌ట్లు హౌస్ క‌మిటీ నిర్ధారించింది. చంద్ర‌బాబు, లోకేష్ ఆధ్వ‌ర్యంలోనే వ్య‌క్తుల డేటా ప్ర‌ైవేట్ సంస్థ చేతిలోకి వెళ్లిన‌ట్లు గుర్తించారు. అప్ప‌టి ప్ర‌తిప‌క్షాన్ని దెబ్బ‌కొట్టాల‌నే ఉద్దేశంతోనే కుట్ర జ‌రిగింద‌న్నారు క‌మిటీ స‌భ్యులు. దీనిపై పోలీస్ విచార‌ణ కూడా జ‌ర‌గాల‌న్నారు.


అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో పెగ‌స‌స్ అంశం దుమారం లేపింది. అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌ర‌గ‌డంతో చివ‌ర‌కు స్పీక‌ర్ త‌మ్మినేని హౌస్ క‌మిటీ ఏర్పాటు చేసారు. అయితే గ‌త నెల‌లో మొద‌టిసారి స‌మావేశ‌మైన స‌భా సంఘం కేవ‌లం పెగ‌స‌స్ పైనే కాకుండా వ్య‌క్తుల స‌మాచార భ‌ద్ర‌త‌పైనా చ‌ర్చిస్తున్న‌ట్లు చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కూ నాలుగు సార్లు క‌మిటీ స‌మావేశ‌మైంది. అయితే పెగ‌స‌స్‌పై కాకుండా డేటా చౌర్యంపై  క‌మిటి చ‌ర్చించింది.


హోంశాఖ‌, ఐటీ శాఖ అధికారుల‌తోపాటు ఆర్టీజీఎస్ అధికారుల‌తో స‌మావేశ‌మై పూర్తి వివ‌రాలు తీసుకున్నార క‌మిటీ స‌భ్యులు. గ‌త ప్ర‌భుత్వం ఉద్దేశపూరకంగానే ప్ర‌జ‌ల డేటా చౌర్యానికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించామ‌న్నారు క‌మిటీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. సాధికార స‌ర్వే ద్వారా వ‌చ్చిన సమాచారం ప్ర‌ైవేట్ వ్య‌క్తుల‌కు అప్ప‌గించిన‌ట్లు నిర్ధారించామ‌న్నారు. సేవామిత్ర అనే అప్లికేష‌న్ ద్వారా సుమారు 30 నుంచి 40 ల‌క్ష‌ల మంది డేటాను సేక‌రించిన‌ట్లు తేల్చింది క‌మిటీ. సేవా మిత్ర ద్వారా తమకు అనుకూలంగా లేని వారి ఓట్లు తొలగించాలని చూసారన్నారు. అప్ప‌టి ప్ర‌తిప‌క్షాన్ని దెబ్బ‌కొట్టాల‌నే ఉద్దేశంతోనే ఈ కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు క‌మిటీ నిర్ధారించిన‌ట్లు భూమ‌న చెప్పారు. మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం కోస‌మే ప్ర‌జాస్వామ్యం ఖూనీ చేసిన‌ట్లు భూమ‌న చెప్పుకొచ్చారు.


డేటా చౌర్యం వెనుక చంద్ర‌బాబు,లోకేష్ కుట్ర ఉంద‌న్నారు భూమన. డేటా ఇత‌ర మార్గాల ద్వారా బ‌య‌టికి వెళ్లే అవ‌కాశం లేద‌ని అధికారులే చెప్పార‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలో ఐటీ శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేసిన విజ‌యానంద్, ఆర్టీజీఎస్ అప్ప‌టి సీఈవో అహ్మ‌ద్ బాబును కూడా విచారించింది క‌మిటీ. త‌ర్వాత స‌మావేశంలో మ‌రింత మందిని విచారిస్తామ‌న్నారు క‌మిటీ స‌భ్యులు. దీనిపై పోలీస్ విచార‌ణ కూడా జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల నాటికి విచార‌ణ పూర్తి చేసి స్పీక‌ర్ కు నివేదిక ఇవ్వ‌నుంది క‌మిటీ. అసెంబ్లీలో చ‌ర్చించిన త‌ర్వాత దీనిపై ఎలా ముందుకెళ్లాలో నిర్న‌యం తీసుకోనుంది ప్ర‌భుత్వం.


వ‌చ్చే అసెంబ్లి స‌మావేశాల్లోనే నివేదిక‌...


స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ ఏర్పాటు చేసిన హౌస్ క‌మిటి స్పీడ్ గా నివేదిక‌ను సిద్దం చేయాల‌ని భావించింది. ఇందుకు త‌గ్గట్లుగానే అధికారుల నుంచి నివేదిక తీసుకోవ‌టంతోపాటుగా నాలుగు సార్లు స‌మావేశం నిర్వ‌హించి, పూర్తి స్దాయిలో ఆధారాల‌ను సేకరించారు. ప్ర‌ధానంగా పెగాసెస్ వ్య‌వ‌హ‌రంపై దృష్టి సారించిన‌ప్ప‌టికి, డేటా చోరీకి సబంధించిన వ్య‌వ‌హ‌రమే అత్యంత కీల‌కమైంది.పెగాసెస్ వ్య‌వ‌హ‌రంలో ఇప్ప‌టికే తీవ్ర స్దాయిలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై ఇప్ప‌టికే ప్ర‌భుత్వం కఠిన చ‌ర్య‌లు తీసుకుంది. ఆయ‌న‌కు పోస్టింగ్ ఇచ్చిన‌ట్లే ఇచ్చి మ‌రోసారి కూడా స‌స్పెండ్ చేసింది. శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు అవ‌సరం అయిన అన్ని అంశాల‌ను కూడా ఇప్ప‌టికే ప‌రిశీల‌న‌లో పెట్టారు. ఈ నేప‌థ్యంలో హౌస్ క‌మిటి త్వ‌ర‌లో స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టే నివేదికపై ఉత్కంఠ‌ నెల‌కొంది. ఇందులో ఎవ‌రి ప్ర‌మేయం ఉంది. గ‌త ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఎవ‌రు, అప్ప‌టి ప్ర‌జాప్ర‌తినిదులు ఎంత మంది ఇందులో భాగస్వామిగా వ్య‌వ‌హ‌రించార‌నే అంశాల‌ను క‌మిటి సేక‌రించి స‌భ ముందు ప్ర‌వేశ‌పెడుతుంది.