చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా నేడు (ఆగస్టు 25) తలెత్తిన ఉద్రిక్తతలు, అన్నా క్యాంటిన్ ధ్వంసం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ నేతల తీరును ఖండించారు. తనపైనే దాడికి సిద్ధమైన వైఎస్ఆర్ సీపీ నేతలకు సామాన్య ప్రజలపై దాడి చేయడం ఓ లెక్కా అని అన్నారు. టీడీపీ నేత రవిచంద్ర 90 రోజుల నుంచి పేద ప్రజలకు అన్నం పెడుతుంటే అది నేరమా అని ప్రశ్నించారు. ఇది తప్పు అవునా కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా ధర్మపోరాటానికి కుప్పం నుంచే నాంది పలుకుతున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. ప్రజా పరిరక్షణకు నాంది అని అన్నారు. కుప్పంలో గురువారం చెలరేగిన ఉద్రిక్తతల వేళ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సీఎం జగన్, వైఎస్ఆర్ సీపీ నేతలను విమర్శిస్తూ మాట్లాడారు.
పోలీసుల తీరుపైన కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. చిత్తూరు ఎస్పీ అసలు జిల్లాలో ఉన్నారా? లేరా? అని నిలదీశారు. వైసీపీ నేతల ఇళ్లపై దాడి చేసేందుకు తనకు ఒక్క క్షణం పట్టదని, చేతగాని తనం అనుకోవద్దని వ్యాఖ్యానించారు. కుప్పంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం తిరుగుబాటు చేస్తామని అన్నారు. పోలీసులు చట్టాన్ని అమలు చేయకపోతే వారిని కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని అన్నారు. మీకు 60 వేల మంది బలగం ఉంటే, నాకు 60 లక్షల మంది సైన్యం ఉందని అన్నారు. ఇక్కడ ఉండే పోలీసులు కీలు బొమ్మలని, వారిని ఆడించేది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
చంద్రబాబు రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపిన ఫోటోలు ఇక్కడ చూడండి
‘‘కుప్పంలో జరుగుతున్న పరిస్థితిని ఎలా అభివర్ణించాలో అర్ధం కావడం లేదు. ఐదు కోట్ల ప్రజలు ఆలోచించాలి. వీధికి, గల్లీకి ఓక రౌడీని, నియోజకవర్గానికి ఓ గుండాను వైఎస్ఆర్ సీపీ తయారు చేసింది. రౌడీలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే చూస్తూ ఊరుకోను. కుప్పం మంచికి మానవత్వానికి మారు పేరు. టీడీపీ నాయకుడు రవి చంద్రపై దాడిని ఖండిస్తున్నా. పోలీసులు చట్టాన్ని విస్మరించి రౌడీలుగా ప్రవర్తిస్తున్నారు. చట్టాన్ని విస్మరించిన ఏ ఒక్క పోలీస్ ని వదిలిపెట్టను. న్యాయ వ్యవస్థ అంటే వైసీపీకి లెక్క లేదు. న్యాయ వ్యవస్థ అంటే ఏంటో వైసీపీకి తెలియజేస్తా, పోలీసు వ్యవస్థను గాడిలో పెడతా.. పోలీసు వ్యవస్థలో చీడపురుగులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఒంటరిగా ఎక్కడికి వెళ్లాలన్నా భయపడే స్థాయికి వైసీపీ నాయకులు తీసుకొచ్చారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పెడితే నాపై ప్రజలపై దౌర్జన్యాన్ని చేశారు వైసీపీ గుండాలు’’ అని చంద్రబాబు మాట్లాడారు.
అంతకుముందు, కుప్పంలో నేడు ప్రారంభించనున్న అన్నా క్యాంటిన్ ను వైఎస్ఆర్ సీపీ నేతలు ధ్వంసం చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతల తీరుకు నిరసనగా ఆయన నడి రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. అంతకుముందు ఆయన కార్యకర్తలతో కలిసి కుప్పంలోని అన్నా క్యాంటిన్ వరకూ ర్యాలీగా వచ్చారు.