TDP Chief Chandrababu comments : చిత్తూరు : కుప్పంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్ష కట్టాడని, ప్రజా వేదిక కూల్చి విధ్వంసానికి నాంది పలికారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, ఎందులో చూసినా బాదుడే బాదుడుగా ఏపీలో పరిస్థితి ఉందన్నారు. రాని కరెంట్ కు బిల్లుల మోత.. గత నెల కంటే కరెంట్ బిల్లులు డబుల్ అయ్యాయని, కరెంట్ ఇవ్వలేని వాళ్ళు బిల్లులు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. 


శాంతిపురం మండలం బెల్లకోకిల, అనికెర క్రాస్‌లలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్ కుప్పంపై కక్ష కట్టాడని, తాను పులివెందులకు నీళ్ళు ఇచ్చానని, జగన్ కుప్పంకు నీళ్ళు ఆపేశారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అనేది లేదని, ఇప్పుడు పంట దెబ్బతిన్నా ఒక్క అధికారి రాలేదన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరించవద్దని సూచించారు. రెండేళ్లలో అధికారం కోల్పోయే జగన్ మీటర్లు పెట్టి పోతే ఎలా అని ప్రశ్నించారు. 


ప్రజల రక్తం తాగే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి..
ఏపీ సీఎం జగన్ ఒక జలగలా తయారయ్యాడని, అన్నిటిపై పన్నులతో రక్తం పీల్చుతున్నారని ఆరోపించారు. 95 శాతం హామీల అమలు ఎక్కడ జరిగిందో జగన్ చెప్పాలి. 8 లక్షల కోట్ల అప్పులకు లెక్కలు లేవు, మీ అబ్బ సొమ్మా..? అని మండిపడ్డారు. పిల్లలను ఇంజనీర్, మెడిసిన్ చదివించాలి అంటే నారాయణ, చైతన్య సంస్థలు గుర్తుకు వస్తాయి.. కానీ సీఎం జగన్ రాజకీయ కక్షతో నారాయణను అరెస్ట్ చేశారని చంద్రబాబు చెప్పారు. 


మానవత్వం లేని సీఎం..
నారాయణ కొడుకు వర్ధంతి కార్యక్రమంలో ఉంటే వెళ్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మానవత్వం లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్నారు చంద్రబాబు. 60 మంది టీడీపీ ముఖ్య నేతల, ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టారు. మేము నాడు అనుకుంటే వైసీపీ వాళ్లు ఉండే వాళ్లా..? అని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన 4 గురు మాజీ మంత్రులను, 6 గురు మాజీ ఎమ్మెల్యే లను అరెస్ట్ చేశారు. అచ్చెన్న, కొల్లు, దేవినేని, నారాయణలను అరెస్ట్ చేశారు.


నాడు గ్రాఫిక్స్ అన్నారు, నేడు కేసులా ?
అమరావతిలో అసలు రింగ్ రొడ్డే లేదని, అసలు రోడ్డే లేని చోట అక్రమం అని కేసు ఏంటని అడిగారు. గతంలో అన్ని గ్రాఫిక్స్ అని చెప్పిన వాళ్ళు, ఇప్పుడు రింగ్ రోడ్ లో అక్రమాలు అని కేసు పెట్టారని చంద్రబాబు గుర్తుచేశారు. జగన్‌కు బయట తిరిగే అర్హత లేదు, జీవితాంతం జైలు పక్షిగా ఉండాలి. అధికారం వచ్చి 3 ఏళ్లు అయ్యింది, జగన్ ఏం సాధించారు. 88 శాతం పూర్తి అయిన హంద్రీ నీవా పనులు ఎందుకు పూర్తి చెయ్యలేదో చెప్పాలని సీఎం జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు.