AP Tenth Paper Leak and Malpractice Case: ఏపీలో పదో తరగతి పరీక్షా పత్రాల లీక్ వ్యవహారం గత కొన్ని రోజుల కిందట సంచలనంగా మారింది. సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఏపీలో ఇంత భారీ స్థాయిలో లీక్‌తో ప‌రీక్ష‌ల నిర్వాహ‌ణపై దుమారం చెల‌రేగ‌టం హాట్ టాపిక్‌గా మారింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండ‌టంతో ఇంటర్నెట్ ద్వారా సెక‌న్ల వ్య‌వ‌ధిలో జ‌రగాల్సింది అంతా జ‌రిగిపోయింది. అయితే టెన్త్ ప‌రీక్ష‌ల పేపర్ లీకేజీ వ్య‌వ‌హ‌రంలో పలు ర‌కాలుగా ప్ర‌చారం జ‌రిగింది.పేప‌ర్ ముందుగానే బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని చెబ‌తుండ‌గా కాదు, ప‌రీక్ష ప్రారంభం అయిన అర్ద‌గంట త‌రువాత పేప‌ర్ బ‌య‌ట‌ప‌డింది కాబ‌ట్టి,ఇది కేవ‌లం మాల్ ప్రాక్టీస్ మాత్ర‌మేన‌ని స‌ర్ది చెప్పుకునే ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఇదే రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. 


60 మందిపై కేసులు.. చర్యలు
విద్యార్థుల కెరీర్‌కు ఎంతో కీలకమైన పదో తరగతి పరీక్షా పేపర్లు లీక్, మాల్ ప్రాక్టీస్ వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అందులోనూ ప్రతిరోజూఎగ్జామ్ పేపర్లు లీక్ కావడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ లీక్ కేసు వ్య‌వ‌హ‌రంలో 60మందిపై క్రిమిన‌ల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో  36మంది ఉపాధ్యాయులపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. వారిని స‌స్పెండ్ కూడా చేసింది. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో ప్రశ్నాపత్రాల లీక్‌పై పోలీసులు దర్యాప్తు జ‌రిగింది.


వరుస రోజుల్లో పేపర్ లీక్స్.. 
పదో తరగతి గణితం పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, విచారణలో ప్రశ్నాపత్రం జవాబు పత్రాలు జిరాక్స్ తీయించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. జవాబు పత్రాలను స్వ‌యంగా ఉపాధ్యాయుడే  జిరాక్స్‌ సెంటర్‌లో కాపీలు జిరాక్స్ తీయించినట్లు గుర్తించారు. కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని టీచర్లకు వాట్సాప్‌ ద్వారా జవాబు పత్రాలు చేరవేసినట్లుగా తేల్చారు. కృష్ణా జిల్లా పామర్రు, నందివాడ, గుడివాడ టీచర్లకు జవాబు పత్రాలు చేరాయ‌ని నిర్దారించారు.


ఏలూరు జిల్లా మండవల్లిలో టీచర్లకు జవాబు పత్రాలు చేరవేశారని విచారణలో గుర్తించారు. ఏప్రిల్ 27నుంచి ప్రారంభమైన పదోతరగతి పరీక్షల పేపర్ల లీకులతో నిర్వహణపై వరుస వివాదాలు తలెత్తాయి. ఏప్రిల్ 27, 28 తేదీల్లో తెలుగు, హిందీ పేపర్లు ప్రారంభమైన గంటన్నర తర్వాత బయటకు వచ్చాయని, దీన్ని లీక్‌గా భావించబోమని అధికార యంత్రాంగం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ప్రశ్నపత్రాలను తెరిచే సమయంలోనే సెల్‌ఫోన్లతో ఫొటోలు తీస్తున్నట్లుగా పోలీసులు విచార‌ణ‌లో కూడ వెల్ల‌డ‌య్యింది. 


చివరికి నారాయణ అరెస్ట్, బెయిల్ 
ఏపీ టెన్త్ పేపర్ల లీక్, మాల్ ప్రాక్టీస్ కేసు చివరికి రాష్ట్ర మాజీ మంత్రి నారాయ‌ణ అరెస్ట్ వ‌ర‌కు దారితీసింది. ఏపీ సీఐడీ పోలీసులు తెలంగాణకు వచ్చి మరీ హైదరాబాద్ లో నారాయణను అరెస్ట్ చేయడంతో వ్య‌వ‌హ‌రం మరింత ముదిరింది. ఇక ఇప్పుడు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు కూడా ముగిశాయి. నారాయ‌ణ‌కు బెయిల్ కూడా మంజూరు కావ‌టంతో మ‌రి ఈ వ్య‌వ‌హ‌రం ఇంత‌టితో సైలెంట్ అవుతుందా... రాజ‌కీయంగా కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. మ‌రో వైపున స‌స్పెన్ష‌న్ కు గుర‌యిన ఉపాధ్యాయుల ప‌రిస్దితి ఎంట‌న్న‌ది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 


Also Read: Nellore Lecturer: ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం! రోగికి స్వీపర్, సెక్యురిటీ ట్రీట్మెంట్ - పేషెంట్ మృతి


Also Read: Sajjala : నారాయణ బెయిల్‌ రద్దు కోసం పైకోర్టుకు వెళ్తాం - సజ్జల ప్రకటన !