అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజవర్గంలో  శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ కీలక నేత. ఆయన  భార్య కౌన్సిలర్ కూడా. వారికి పురుగు మందుల దుకాణం ఉంది. హఠాత్తుగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమకు నకిలీ మందులు అమ్మారంటూ చొక్కా పట్టుకుని కొట్టడం ప్రారంభించారు. దుకాణం బయటకు తీసుకెళ్లి దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.


అంత పట్టపగలు అధికార పార్టీ కౌన్సిలర్ భర్తపై దాడి  చేస్తారా..? ఎంత ధైర్యం ? అని చాలా మంది అనుకున్నారు. నిజానికి వారు శ్రీకాంత్ రెడ్డి దుకాణంలో ఎలాంటి పురుగుమందులు కొనలేదు. కేవలం దాడి చేయడానికే వచ్చారు. వారు కూడా అధికార పార్టీ నేతల అనుచరులే. శ్రీకాంత్ రెడ్డి కౌన్సిలర్ భర్త అయితే..  ఆ వచ్చిన వారు మాత్రం మంత్రి ఉషాశ్రీచరణ్ అనుచరులు. మంత్రి అనుచరులుగా అందరికీ తెలిసిన  బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట, కుర్లగుండ గ్రామాలకు చెందిన జాని, వన్నూరుస్వామి దాడికి యత్నించారు తిరిగి  మంగళవారం సాయంత్రం ఎరువుల దుకాణానికి వచ్చి నకిలీ మందులు ఇచ్చారని ఆరోపిస్తూ. శ్రీకాంత్‌ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. 


కల్యాణదుర్గంలోని మధు ఫర్టిలైజర్స్‌ యజమాని శ్రీకాంత్‌రెడ్డి భార్య ఒంటెద్దు ప్రభావతి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్‌. ఇటీవల మంత్రి ఉషా శ్రీచరణ్‌, శ్రీకాంత్‌రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీల్లో వివాదం చోటుచేసుకుంది. అప్పు వసూలు కోసం శ్రీకాంత్‌ రెడ్డి దంపతులు గత నెల 6న  మంత్రి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. దీన్ని జీర్ణించుకోలేని మంత్రి, అదే రోజు శ్రీకాంత్‌రెడ్డి బావమరిది రామిరెడ్డిపై మున్సిపల్‌ కార్యాలయంలో జానీ, వన్నూరుస్వామి అనే వ్యక్తులు చేత దాడి చేయించారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి మంత్రి, శ్రీకాంత్‌రెడ్డి దంపతుల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో మరోసారి అదే వ్యక్తులు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేశారు.


శ్రీకాంత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కానీ అలా అదుపులోకి తీసుకుని నిందితుల్ని ఇలా వదిలేశారు.  మంత్రి సూచనలు మేరకు దాడులకు పాల్పడిన వారితో ఫిర్యాదు చేయించి అట్రాసిటీ కేసులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ారోపిస్తున్నారు.  సార్వత్రిక ఎన్నికల కోసం ఆమెకు తాము అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమని కోరడంతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. మంత్రి వ్యవహార శైలిపై ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశామని కౌన్సిలర్ దంపతులు చెబుతున్నారు.