Tadipatri MLA Kethireddy Pedda Reddy: తాడిపత్రి రాజకీయాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారున్ని ఎమ్మెల్యే చేసుకునేందుకు సోదరుడు జేసీ దివాకర్ రెడ్డిని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చంపాలనుకుంటున్నారని ఆరోపించారు. బెడ్ పై ఉన్న ఆయన సోదరిని చంపాలనుకున్నాడని, డాక్టర్ ను సైతం బెదిరించి చంపాలని చూశారు.. కానీ వైద్యుడు భయపడ్డాడు అంటూ ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని.. ఎప్పుడైనా నిరూపించేందుకు సిద్ధమని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేతిరెడ్డి పరిశీలించడానికి వస్తారని ప్రచారం జరగడంతో తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు జేసీ ఇంటి ఎదుట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ‘ఇప్పుడు జెసీ దివాకర్ రెడ్డిని కూడా చంపి సానుభూతి పొందాలనుకుంటున్నాడు. అందుకే జెసి దివాకర్ రెడ్డి తాడిపత్రికి రావాలంటే భయపడుతున్నారు. జేసీ బ్రదర్స్ లేకపోతే తాడిపత్రి లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. జేసీకి టీడీపీ లో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. తానే ఏదో చేస్తున్నట్టు ఫోకస్ కావాలనుకుంటున్నారు. కేవలం చంద్రబాబు దృష్టిలో పడటానికి, టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ లో కూడా చేశారు. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డికి మతిస్థిమితం లేకుండా పోయింది.. జేసీ ప్రభాకర్ రెడ్డి కి కూడా అదే పరిస్థితి. జూనియర్ కాలేజ్ గ్రాండ్ కి కాంపౌండ్ నిర్మిస్తుంటే అడ్డుకుంటున్నారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.


దివాకర్ రెడ్డి ఇప్పటికే మతిస్థిమితం కోల్పోగా, త్వరలో ప్రభాకర్ రెడ్డికి సైతం ఆ జబ్బు వస్తుందన్నారు తాడిపత్రి ఎమ్మెల్యే. జూనియర్ కళాశాల గ్రౌండ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. అక్కడ 120 అడుగుల రోడ్డు ఉందని చెబుతున్నారు, అదే నిజమైతే నీ ఇళ్లు కూడా పోతుంది. దానికి సిద్ధమా అని జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించారు. కాలేజీ గ్రౌండ్ లో పడేసిన మద్యం బాటిళ్లు అమ్ముకుని తన ఇంటికి పాలు తెచ్చుకుంటున్నాడు. ఇంకా 10 నెలలు టైం ఉందని, ఆ తరువాత తట్టబుట్టా సర్దుకుని పోతారంటూ ఎద్దేవా చేశారు. ఒకసారి వాళ్ల ఇంటికి, జేసీకి అదృష్టం పట్టి మునిసిపల్ ఛైర్మన్ అయ్యాడన్నారు. ఇప్పుడు నాతో తన్నించుకోవాలని చూస్తున్నాడని, నేను తంతే అదృష్టం పట్టి మళ్లీ ఎమ్మెల్యే అవుతాడేమోనంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. 


ఎవరి హయాంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయో.. ఎవరు కాపాడారు చర్చకు సిద్ధమా అంటూ జేసీ బ్రదర్స్ కు సవాల్ విసిరారు. తాడిపత్రిలో నోటాకు అయిన ఓటు వేస్తారు కానీ జేసీకి ఎవరూ ఓటు వేయరు అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కావాలని కోరిక ఉంది, ఆయన కుమారుడికి పబ్బుల్లో తిరగాలని కోరిక ఉందని.. వీరిద్దరిని ఆ దేవుడే కాపాడాలన్నారు. జేసీ విషయంలో అధికారులు ఇంత మౌనంగా ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తున్నా అధికారుులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని ప్రశ్నించారు. ఇప్పటినుంచి ఓ 10 నెలల తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరు విడిచి వెళ్లడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.