శ్రీకాళహస్తి దేవాలయంలో భక్తులతో అమర్యాదగా ప్రవర్తించిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. క్యూలైన్లో ప్రసాదం పంపిణీ చేయకుండా బయటికి పంపించడంపై భక్తుల నుంచి తనకు సమాచారం అందగానే ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భక్తుల ఫిర్యాదు మేరకు దేవాదాయ శాఖ సీసీటీవీలో పరిశీలించి విచారణ చేసింది. భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా, అమర్యాదగా ప్రవర్తించడడం నిజమేనని నిర్ధారించారు. ఆ సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. భవిష్యత్తులో ఏ ఆలయంలోనూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏ పనులను కూడా ఉపేక్షించేది లేదన్నారు మంత్రి నారాలోకేష్ . కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు గడుస్తున్నా.. కొంతమంది సిబ్బంది ఇంకా గత వైసీపీ ప్రభుత్వ విధానాల నుంచి బయటకు రాలేదన్నారు. నిర్లక్ష్యం, అమర్యాదగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని నారా లోకేష్ స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూలైన్లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపటంపై విచారణ చేపట్టి, తప్పు ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని లోకేష్ ఇదివరకే హామీ ఇచ్చారు. విచారణ జరిపి సిబ్బందిపై వేటు వేశారు.