YSRCP MLA Biyyapu Madhusudhan Reddy About Rajinikanth:
తిరుపతి : ఇటీవల ఏపీలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ప్రారంభ వేడుకలో పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొదట మంత్రులు కౌంటర్ ఇవ్వగా, ఆపై పార్టీ ఎమ్మెల్యేలు సైతం రజినీకాంత్ పై తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు. తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూపర్ స్టార్ రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయమంటే బీడీలు, సిగరెట్లు గాలిలో ఎగరేసి స్టైల్ గా కాల్చడం కాదంటూ రజినీకి చురకలు అంటించారు.


ఏపీ రాజకీయాల గురించి నీకేం తెలుసు అని నటుడు రజినీకాంత్ ను వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. రజనీకాంత్ నువ్వేమన్నా నిజాయితీపరుడువా.. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏం చేశావో చెప్పు అని అడిగారు. నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతావు.. సినీ ఫీల్డ్ లో నీచుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే అంటూ సూపర్ స్టార్ పై మండిపడ్డారు. సినీ ఫీల్డ్ నుంచి ఏదిగి రాజకీయంగా ఎంతో మంది ఎమ్మెల్యేలకు సహాయం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు అని కొనియాడారు. నువ్వు సినీ ఫీల్డ్ నుంచి ఎదిగిన వాడివే కదా తమిళనాడులో నువ్వు ఎంతమంది పేద ప్రజలకు  సహాయం చేశావు అని ప్రశ్నించారు.


చంద్రబాబు బినామీలతో సినిమాలు తీస్తావా! 
చంద్రబాబు నాయుడు విజన్ కలిగిన వ్యక్తి అని మాట్లాడుతావా.. నీ రాష్ట్రంలో మూడుసార్లు పార్టీ పెట్టి ఎత్తేసిన ఘనుడవు అని రజినీకాంత్ ను ఎద్దేవా చేశారు. రజనీకాంత్ తో చంద్రబాబు బినామీలు కలిసి సినిమా చేస్తాము అని చెబితే నువ్వు ఏమీ చేయలేని ఏజ్ లో ఉన్నావు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిమాలయాల్లో కూర్చో ఉండే నువ్వు కూడా మా రాష్ట్రం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు శ్రీకాళహస్తి వైసీపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.


అల్లుడి తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయించిన ఘనుడు రజినీకాంత్  
మీరు సూపర్ మెన్ సినిమాలు చూసి ఉంటారు. అందులో హీరో డ్రెస్సు మీద అండర్ వేర్ వేసుకుని కనిపిస్తాడు. అలాగని సినిమాలు చూశామని, మనం అలా బయట అండర్ వేర్ వేసుకుని తిరగం కదా అన్నారు. తమిళనాడులో ఉండే నీకు ఏపీ రాజకీయాల గురించి ఏం అవగాహనా ఉంది అని రజినీకాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి కూతురు భర్త ను వాళ్ల తల్లిదండ్రులను కూడా కాదని చెప్పిన దారుణమైన వ్యక్తి రజినీకాంత్ అని వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. నా కొడుకు ఇతడే అని వాళ్ల తల్లిదండ్రులు వచ్చి ఇంటి ముందు ధర్నా చేస్తే వారిని అరెస్ట్ చేపించారని మండిపడ్డారు. స్టైల్ సినిమాల్లో కాదు, రియల్ జీవితంలో చూపిస్తేనే సూపర్ స్టార్ అవుతారని చెప్పారు. ఇక్కడ రామారావుగారు సినిమాల నుంచి వచ్చి రాజకీయాల్లో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన గొప్పవారని ప్రశంసించారు. కానీ ఎన్టీఆర్ తో పోల్చుకునే అర్హత కూడా లేని వ్యక్తి రజినీకాంత్ అన్నారు.